సాక్షి, బెంగళూరు
సిలికాన్ సిటీ బెంగళూరులో మందుబాబులు రెచ్చిపోతున్నారు.. తాగి వాహనాలను నడుపుతూ పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలా ఏకంగా గతేడాది 73,741 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక పోలీసు విభాగం చరిత్రలో ఇదొక రికార్డు. 2016తో పోలిస్తే 2017 సంవత్సరంలో 25 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. 2016లో 59,028, 2015లో 62,576 కేసులు నమోదయ్యాయి. పోలీసు శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసున్నా మందుబాబులు వాటిని బేఖాతరు చేస్తున్నారు.
మద్యం సేవించి వాహనం నడిపితే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మందు తాగాక క్యాబ్ సేవలు వినియోగించుకుని ఇంటికెళ్లాలని పోలీసు శాఖ సూచిస్తున్నా వాటిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గతేడాది ఆశ్చర్యకరంగా అధిక సంఖ్యలో స్కూల్ బస్సులు, అంబులెన్సుల డ్రైవర్లు సైతం మద్యం సేవించి వాహనాలను నడిపి పోలీసులకు దొరికిపోయారు.
డిసెంబర్‌లోనే అత్యధిక కేసులు...
మూడేళ్లుగా డిసెంబర్ నెలలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. క్రిస్‌మస్, కొత్త సంవత్సరం పండుగలను పురస్కరించుకుని మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా 10,517 కేసులు ఒక్క డిసెంబర్ నెలలో నమోదు కావడం గమనార్హం. అదేవిధంగా 2016, డిసెంబర్‌లో 6,666 కేసులు, 2015, డిసెంబర్‌లో 9,461 కేసులు నమోదయ్యాయి.
డిసెంబర్ 30న 1,187 కేసులు..
డిసెంబర్ నెలలో నమోదయ్యే కేసుల సంఖ్య ఒక ఎత్తు అయితే ఆ నెల 30వ తేదీన నమోదయ్యే కేసుల సంఖ్య మరొక ఎత్తు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని ఆ రోజు మద్యం అమ్మకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2016 డిసెంబర్ 30న 1,090 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయితే, 2017 డిసెంబర్ 1,187 కేసులు నమోదయ్యాయి.
కఠిన శిక్షలు పడాలి..
ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ ఆర్.హితేంద్ర మాట్లాడుతూ గతేడాది రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని వెల్లడించారు. గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా చేపట్టడం వల్ల ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదయినట్లు స్పష్టంచేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైన వారి డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ రద్దు చేస్తేనే వాహనదారుల్లో కొంతమేర మార్పు కనపడే అవకాశం ఉందని వివరించారు. మద్యం తాగి పట్టుబడితే రూ. 2 వేల జరిమానా కట్టి ఇళ్లకు వాహనదారులు వెళ్లిపోతున్నారని, మూడు నెలల తర్వాత తిరిగి లైసెన్స్ తెచ్చుకుంటున్నారని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలుచేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment