
బంట్వారం: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నతల్లిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండల పరిధిలోని రొంపల్లిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహబూబీ (55), చిన్న మైబు దంపతులకు ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు జరిపారు. గతేడాది కొడుకు మస్తాన్‌కు వివాహం జరిపించారు. ఈ క్రమంలో వారు కొడుకు, కోడలితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మస్తాన్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. సోమవారం ఎప్పటిలాగానే అందరూ కలిసి భోజనం చేశారు. నిద్రకు ఉపక్రమించే సమయంలో మద్యం మత్తులో ఉన్న మస్తాన్ తల్లితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో మస్తాన్ క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహబూబీ భయాందోళనతో అరుస్తూ బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్‌లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మంగళవారం పోస్టుమార్టం జరిపించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కూతురు బీబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధారూరు సీఐ రాజు తెలిపారు.