సురేందర్‌చంద్ మృతదేహం, నిందితుడు కరణ్‌చంద్
అనంతపురం, తాడిపత్రి అర్బన్: పోలీస్ పట్టణంలోని ఓ బార్‌లో శనివారం రాత్రి ఇద్దరు మందుబాబులు వీరంగం సృషించారు. ఒకరిపై ఒకరు మద్యం సీసాలతో దాడి చేసుకోవడంతో ఉత్తరాంచల్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. జంబులపాడు సమీపంలోని అర్జాస్ స్టీల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉత్తరాంచల్ రాష్ట్రం కైత్వాడ్ జిల్లాకు చెందిన కరణ్‌చంద్, సురేందర్‌చంద్ (36)లు శనివారం రాత్రి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలోని హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.
అక్కడ పూటుగా మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో మద్యం సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సురేందర్‌చంద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీపబంధువు బింబగదుర్ సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి పంపించారు. అయితే అప్పటికే సురేందర్‌చంద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన కరణ్‌చంద్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment