విచారిస్తున్న డీఎస్పీ నల్లమల రవి, సీఐ తిరుపతియాదవ్
కంగ్టి(నారాయణఖేడ్) : కులం పేరుతో దూషించారని వచ్చిన ఫిర్యాదుపై డీఎస్పీ నల్లమల రవి ఆధ్వర్యంలో మంగళవారం కంగ్టి ఎంపీపీ కార్యాలయంలో అధికారులను విచారించారు. గత నెల 30న కంగ్టి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రామారావు జాదవ్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.
తాము చేసిన సీసీ రోడ్డు పనుల బిల్లులు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకొంటున్నారంటూ పురుగుల మందు తాగుతానని చూపిన సమయంలోనే తనను కొందరు కులం పేరుతో దూషించారంటూ ఈ నెల 1న ఎంపీపీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సర్వసభ్య సమావేశంలో అసలు సభ్యులకు బదులుగా కూర్చున్న డమ్మీ వ్యక్తులైన సిద్దు, వెంకట్‌రెడ్డి, బస్వరాజ్, సంతోష్‌పాటిల్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మండల స్థాయి అధికారులు తహసీల్దార్ రాజయ్య, ఎంఈఓ మల్లేశం, ఎంపీడీఓ రత్నమాల, పీఆర్ ఏఈ మాధవనాయుడు, సర్పంచ్ విఠల్ జాదవ్‌తో పాటు పలువురిని మంగళవారం డీఎస్పీ విచారించారు. పంచాయతీ తీర్మానం లేకుండా బిల్లులు చెల్లించడం ఎలా సాధ్యం అని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు.
ఎంపీపీని కులం పేరుతో దూషణ, చంపుతానంటూ బెదిరింపులు, ఎమ్మెల్యే నా ఇష్టం వచ్చినట్లు చేస్తా...పో అంటూ అన్నాడనే ఫిర్యాదులపై విచారించారు. విచారణ నివేదికను పై అధికారులకు సమర్పించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ తిరుపతి యాదవ్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ధన్‌రాజ్, పంచాయతీ సెక్రెటరీలు విజయలక్ష్మి, కిష్టయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment