
పోలీసులకు పట్టుబడ్డ నిందితులు
సాక్షి, సిటీబ్యూరో: మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థలతో పాటు ట్రావెల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని, నిర్వాహకుల దృష్టి మళ్ళించడం ద్వారా ‘జిరాక్సు కరెన్సీ’ అంటగట్టి అందినకాడికి దండుకుంటున్న ముఠాకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. మొత్తం నలుగురు సభ్యులు ఉన్న ఈ గ్యాంగ్‌లో ఇద్దరిని పట్టుకుని రూ.1.6 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ ఆదివారం వెల్లడించారు. నగరంలోని బండ్లగూడ సుభాన్‌కాలనీకి చెందిన మహ్మద్ సమీరుద్దీన్ అలియాస్ సమీర్ అలియాస్ అజ్జు ప్రస్తుతం కామారెడ్డిలోని రాజీవ్‌నగర్‌లో నివసిస్తూ వంటవాడిగా పని చేస్తున్నాడు.
బోధన్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అబ్దుల్ రిజ్వాన్, కామారెడ్డికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహ్మద్ ఆరిఫ్, బిచ్‌కొండకు చెందిన ముజాహిద్ అలియాస్ మజ్జులతో ఇతడికి స్నేహం ఏర్పడింది. ఈ నలుగురూ కలిసి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించారు. వివిధ మన్సీ ఎక్ఛ్సేంజ్ సంస్థలు, ఆ పని చేసే ట్రావెల్ ఏజెన్సీలను ఎంచుకున్నారు. వారిని మాటల్లో ఉంచి మోసం చేసి అనుకున్న మొత్తం వారి చేతిలో పడగానే ఉడాయిస్తారు. వీరి వ్యవహారాలతో పాటు కదలికలపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌స్వామి, పి.రమేష్, సి.వెంకటేష్ రంగంలోకి దిగారు. పాతబస్తీలో సంచరిస్తున్న సమీరుద్దీన్, రిజ్వాన్‌లను పట్టుకున్నారు.
వీరి నుంచి రూ.1.6 లక్షల నగదు, ద్విచక్ర వాహనం, ఐదు సెల్‌ఫోన్లు, మోసాలు చేయడం కోసం నల్లరంగు పౌచ్‌ల్లో సిద్ధంగా ఉంచిన దిరమ్స్ కలర్ జిరాక్సు ప్రతులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముఠా సభ్యులు ఆరిఫ్, మజ్జు కోసం గాలిస్తున్నారు. సమీరుద్దీన్‌కు గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. ఇతడిపై బికనూర్ పోలీసుస్టేషన్‌లో దోపిడీ, అబిడ్స్ పోలీసుస్టేషన్‌లో బెదిరించి వసూళ్ళు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌లో అత్యాచారం కేసు ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇలాంటి ముఠాల పట్ల మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. వ్యాపారం లావాదేవీల సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ దృష్టి మళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మోసం చేస్తారిలా..
ఈ నలుగురూ ఇద్దరిద్దరు చొప్పున ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఉంటారు. ఆ వాహనంపై టార్గెట్ చేసిన దుకాణం వద్దకు వెళ్తారు. ఓ నిందితుడు వాహనం పైనే ఉండి, దాన్ని ఆన్‌లోనే ఉంచి, పారిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. మరో వ్యక్తి చేతిలో నల్లటి పౌచ్‌తో దుకాణంలోకి వెళ్తాడు. తన వద్ద ఉన్న విదేశీ కరెన్సీ దిమర్స్‌ను భారత కరెన్సీలోకి మార్చాల్సి ఉందంటూ ఆ సంస్థ నిర్వాహకుడికి చెప్తాడు. నల్లటి పౌచ్‌తో సహా అందులో ఉన్న దిరమ్స్‌ను సదరు నిర్వాహకుడికి అందిస్తాడు. తొలుత వాటిని బయటకు తీసి, సరిచూసే మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థ నిర్వాహకుడు ఆపై లెక్కిస్తాడు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ దిమర్స్‌ను భారత కరెన్సీలోకి మారుస్తూ విలువను క్యాలిక్యులేటర్‌లో లెక్కించి, కమీషన్ మినహాయించి చెప్తాడు. అతడు ఎంత చెప్పినా వెంటనే నిందితుడు అంగీకరిండు.
అంత తక్కువ మొత్తం ఇస్తానంటే తాను దిమర్స్‌ను ఇవ్వనంటూ పౌచ్ తీసుకుంటాడు. దుకాణంలోకి వచ్చే ముందే పథకం ప్రకారం అలాంటి మరో పౌచ్‌లో దిమర్స్ కాకుండా వాటి కలర్ జిరాక్సు ప్రతులు తీసుకువస్తాడు. అసలు దిమర్స్ ఉన్న పౌచ్‌ను సంస్థ నిర్వాహకుడి నుంచి చేజిక్కించుకునే నిందితుడు ఆ మాట, ఈ మాట చెప్తూ అతడి దృష్టి మళ్ళిస్తాడు. అదును చూసుకుని ఈ పౌచ్‌ను జేబులో పెట్టేసి, అందులోంచి కలర్ జిరాక్సు ప్రతులతో కూడిన పౌచ్‌ను చేతిలోకి తీసుకుని పట్టుకుంటాడు. కొద్దిసేపు సంస్థ నిర్వాహకుడితో సంభాషించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు అన్నట్లు నటిస్తూ అతడు చెప్పిన మొత్తానికే దిమర్స్ ఎక్ఛ్సేంజ్ చేసుకోవడానికి అంగీకరిస్తాడు.
అలా దిరమ్స్ కలర్ జిరాక్సు ప్రతులతో కూడిన పౌచ్‌ను నిర్వాహకుడికి ఇచ్చేస్తాడు. అంతకు ముందే అసలు దిరమ్స్‌తో ఉన్న పౌచ్‌ను అందుకున్నప్పుడు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు ఈసారి కేవలం లోపల దిమర్స్ ఉన్నాయా? లేదా? అనే విషయం తప్ప మిగిలినవి పట్టించుకునే వారు కాదు. దీంతో ఆ విలువకు తగ్గ భారత్ కరెన్సీకి నిందితుడికి ఇచ్చేసేవాళ్ళు. ఈ నగదు చేతికి అందిన మరుక్షణమే దుకాణం నుంచి బయటకు వచ్చే నిందితుడు అప్పటికే ద్విచక్ర వాహనంపైసిద్ధంగా ఉన్న సహచరుడితో కలిసిక్షణాల్లో ఉడాయిస్తాడు. ఈ పంథాలో హైదరాబాద్, నిజామాబాద్‌ల్లో ఈ గ్యాంగ్ నాలుగు నేరాలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment