కిష్టమ్మ, నర్సయ్య (ఫైల్)
బంజారాహిల్స్: తాగిన మైకంలో వృద్ధ దంపతులు పోలీసులకు చుక్కలు చూపించారు. తన భార్య మెడను నరికేసి మొండాన్ని చెరువులో, తలను కుంటలో పడేశానంటూ వృద్ధుడు పోలీసులకు ఫోన్‌చేసి చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులు 24 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా ఉరుకులు పరుగులు తీశారు. వివరాలు.. బోరబండ సమీపంలోని రాజీవ్‌గాంధీనగర్ పార్కులో నర్సయ్య (75), కిష్టమ్మ (72) దంపతులు వాచ్‌మెన్‌లుగా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం సమీపంలోని కల్లు కాంపౌండ్‌లో పీకల దాకా కల్లు తాగి ఇంటికి వచ్చి గొడవపడ్డారు. దీంతో కిష్టమ్మ బయటకు వెళ్లిపోయింది. ఉదయం 8.30 గంటల సమయంలో స్థానిక కాంగ్రెస్ నేత లియాఖత్‌అలీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ చేసి నర్సయ్య అనే వ్యక్తి తన భార్య మెడను నరికేసి కుంటలో పడేశాడని చెబుతున్నాడని సమాచారం ఇచ్చాడు.
ఆందోళన చెందిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి నర్సయ్యను విచారణ చేశారు. తన భార్య మెడ నరికేశానని మొండాన్ని చెరువులో వేశానని చెప్పాడు. దీంతో నర్సయ్యను వెంటబెట్టుకొని ఆ ప్రాంతాన్ని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో గాలించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఎన్నిసార్లు ప్రశ్నించినా తన భార్యను చంపేశానంటూ చెబుతుండటంతో పోలీసుల ఆందోళన మరింత పెరిగింది. నాలుగు బృందాలు రాత్రంతా గాలించినా శవం ఎక్కడా కనిపించలేదు. తీరా సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎర్రగడ్డ మెయిన్‌రోడ్డులో ఫుట్‌పాత్‌పై పడుకున్న కిష్టమ్మను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. 24 గంటల పాటు పోలీసులకు నరకాన్ని చూపించిన కిష్టమ్మ, నర్సయ్య దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అప్పటికే ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కిష్టమ్మ మిస్సింగ్ కేసు నమోదై ఉంది. అక్కడి పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment