
నకిలీ సీబీఐ ఐడీ కార్డు , వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ
హైదరాబాద్, నాగోలు : భవిష్య వాణి, పూజలు, హోమాల పేరుతో మహిళలను మోసం చేస్తున్న నకిలీ స్వామీజీని రాచకొండ ఎస్‌ఓటీ, వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రూ. 5 లక్షల నగదు, ఇన్నోవా కారు, 5 కేజీల వెండి, నకిలీ పిస్టల్, నకిలీ సీబీఐ ఐడీ కార్డును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. బుధవారం ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా, గుడిమెల్లాకు చెందిన వెంకటా లక్ష్మినర్సింహాచారి, అలియాస్ చారి, అలియాస్ విష్ణు ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. జ్యోతిషం నేర్చుకున్న అతను ఏడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి బాలాపూర్‌లోని అయోధ్యనగర్‌లో ఉంటూ మీర్‌పేట్ పరిధిలో గాయత్రినగర్ చౌరస్తాలో భవిష్య వాణి కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. భవిష్య వాణి చెబుతానంటూ పలు టీవీ చానళ్ళలో చర్చా వేదికలు నిర్వహించేవాడు, కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానని తన ఫోన్ నెంబర్ ఇచ్చి కార్యాలయానికి వచ్చి సంప్రదించమని చెప్పేవాడు. అతని మాటలు నమ్మిన పలువురు అతడిని సంప్రదించేవారు.
భార్యాభర్తల మధ్య గొడవలను ఆసరాగా చేసుకుని మహిళలకు మాయమాటలు చెప్పి వారిని శారీరకంగా వేధించేవాడు. వారి బలహీనత ఆధారంగా రూ.లక్షల్లో వసూలు చేసేవాడు. ఈ నేపథ్యంలో వనస్థలిపురం పరిధిలో భార్యాభర్తలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చారిని సంప్రదించారు. పూజలు చేసి వారికి బాగు చేస్తానని నమ్మించి రూ.లక్ష నగదు, 1.25 కేజీల వెండి తీసుకున్నాడు. సమస్య పరిష్కారం కానందున తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరగా, అతను స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో తప్పిపోయిన యువతి ఆచూకీ తెలిపేందుకు రూ. మూడు లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మీర్‌పేట్ పరిధిలోనూ బాధితుల నుంచి రూ. 1,70 లక్షల నగదు, 1.5 కేజీల వెండి ఆభరణాలు తీసుకున్నాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ..
నర్సింహాచారి స్వామీజీగా (బాబా) చెప్పుకుంటూ గాయత్రినగర్, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరులలో తన భవిష్యవాణి కార్యాలలయాలను ఏర్పాటుచేశాడు. పలు టీవీ ఛానెళ్ళలో భవిష్య వాణి కార్యక్రమం నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ ఇచ్చేవాడు. ఇలా రెండు రాష్ట్రాలల్లో దాదాపు వంద మందికి పైగా మోసం చేశాడు. ఎవరైనా డబ్బులు తిరిగి అడిగితే సీబీఐ నకిలీ ఐడీ కార్డును తయారుచేసుకుని, డమ్మీ పిస్టల్‌తో వారిని బెదిరించేవాడు. రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి డమ్మీ పిస్టల్, పూజ సామాగ్రి, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, రెండు తులాల బంగారం, ఐదు కేజీల వెండి,, రూ.5 లక్షల నగదు, ఒక కారు, నకిలీ సీబీఐ ఐడీ కార్డు, ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఇన్‌చార్జ ఏసీపీ మల్లారెడ్డి, ఎస్‌ఓటీ సీఐలు వెంకటేశ్వరరావు, నవీన్‌కుమార్, వనస్థలిపురం సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ మహేష్, ఎస్‌ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసులు పాల్గొన్నారు.