
నోయిడా: నకిలీ కాల్‌సెంటర్ ద్వారా అమెరికా పౌరులను మోసం చేసి కోట్లు సంపాదిస్తున్న ముఠా గుట్టును నోయిడా పోలీసులు గురువారం రాత్రి రట్టు చేసి, 126 మందిని అరెస్టు చేశారు. రూ. 20 లక్షల నగదు, 312 కంప్యూటర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా దొరకలేదని చెప్పారు. కాల్ సెంటర్ నుంచి అమెరికా పౌరులకు ఈ ఉద్యోగులు ఫోన్ చేసి ‘మీ సామాజిక భద్రతా సంఖ్యలో లోపాలున్నాయి, కొంత జరిమానా కట్టి పరిస్థితిని చక్కదిద్దుకోండి, లేదంటే అరెస్ట్ తప్పదు’ అని బెదిరించారు. భయంతో వారంతా ‘ప్లే స్టోర్ కార్డ్’ల రూపంలో డబ్బు చెల్లించారు. సగటున ఈ కాల్ సెంటర్ ద్వారా ఒక రోజులో 50 వేల డాలర్లను వీరు అక్రమంగా సంపాదించారని పోలీసులు చెప్పారు.