
నకిలీ నోట్లను మీడియాకు చూపెడుతున్న అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఒక బెంగాలీ సహా ఇద్దరిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.3.98 లక్షలు విలువ గల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని నగర కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలసి తన కార్యాలయంలో విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. ఈ కరెన్సీ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నామని అన్నారు.
గౌస్ దందానే నకిలీ కరెన్సీ..
చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేకమంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చలామణి చేసేవాడు. అలా వచ్చిన మొత్తం నుంచి ఏజెంట్ల వాటాను వారికి పంపేవాడు. ఈ తరహాలో దందా చేస్తూ ఇప్పటికే మోండా మార్కెట్, గోపాలపురం, కంచన్‌బాగ్, గోపాలపురం, శాలిబండ, కాలాపత్తర్, భవానీనగర్, చాంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, చార్మినార్, విజయవాడ, విశాఖపట్నం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇప్పటివరకు సిటీలో 13 సార్లు, బయట 2 సార్లు నకిలీ కరెన్సీ కేసుల్లో చిక్కాడు.
జైలు నుంచి వచ్చిన నెల్లోనే..
జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన ప్రతిసారీ పోలీసు నిఘా నుంచి తప్పించుకోవడానికి తన చిరునామా మార్చేసే గౌస్ ప్రస్తుతం తలాబ్‌కట్ట మహ్మద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తన కుటుంబీకులతోనూ కలసి నకిలీ కరెన్సీ మార్పిడి చేసే ఇతగాడికి పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్‌కు చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేవాడు. 2016 సెప్టెంబర్‌లో సిటీ పోలీసులకు చిక్కిన గౌస్ గత నెల 12న విడుదలయ్యాడు. ఖాళీగా ఉండకుండా వెంటనే తన దందా మొదలెట్టాలని ప్రయత్నించాడు. రెండేళ్లకు పైగా జైల్లో ఉండటంతో ఇతడి వద్ద బబ్లూ కాంటాక్ట్ మిస్ అయింది. దీంతో విశాఖ జైల్లో ఉన్న తన పరిచయస్తుడు సిరాజ్ షేక్‌ను గత నెల 19న ములాఖత్‌లో కలిశాడు. అతడి నుంచి గౌస్ నంబర్ తీసుకుని సంప్రదించి నకిలీ కరెన్సీ సరఫరా చేయమని కోరాడు. రూ.4 లక్షల విలువైన కొత్త రూ.2,000 నోట్లు పంపడానికి అతడు అంగీకరించడంతో అది మార్పిడి చేసి రూ.1.6 లక్షలు తిరిగి ఇస్తానని ప్రతిపాదించాడు.
స్నేహితుడికి ఇచ్చి సిటీకి సరఫరా..
దీనికి అంగీకరించిన బబ్లూ రూ.2,000 డినామినేషన్‌లో ఉన్న రూ.4 లక్షల నకిలీ కరెన్సీని గౌస్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. తనకు పరిచయస్తుడైన మాల్దా వాసి రబీబుల్ షేక్‌కు ఈ మొత్తాన్ని ఇచ్చిన బబ్లూ వారిని రైలులో హైదరాబాద్‌కు పంపాడు. షేక్ గతంలోనూ సిటీలో నకిలీ కరెన్సీ రవాణా చేసి 2015లో ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడు మైనర్ కావడం గమనార్హం. ఇతడికి సిటీపై పట్టు ఉండటంతోనే బబ్లూ ఆ మొత్తాన్ని ఇతడికి ఇచ్చి పంపాడు. ఇతడికి గౌస్ ఫోన్ నంబర్ ఇచ్చిన బబ్లూ నగరానికి చేరుకున్నాక సంప్రదించి నగదు అందించమని చెప్పాడు. దీంతో అతగాడు శుక్రవారం సిటీకి చేరుకుని గౌస్‌ను సంప్రదించాడు.
అతడు చెప్పిన ప్రకారం చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నకిలీ కరెన్సీ అందించాడు. ఆ మొత్తం నుంచి రూ.2 వేలను ఓ పండ్ల వ్యాపారి వద్ద మార్పిడి చేసిన గౌస్ నగదు క్వాలిటీపై సంతృప్తి చెందాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్ వర్మ, మహ్మద్ తఖ్రుద్దీన్, వి.నరేందర్ తమ బృందాలతో వలపన్ని ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.98 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకుని కేసును చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇంతటి హైక్వాలిటీతో, సామాన్యులు గుర్తుపట్టలేని విధంగా ఉన్న కరెన్సీ చిక్కడం డీమానిటైజేషన్ తర్వాత ఇదేతొలిసారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు.