సాక్షి, సిటీబ్యూరో: బోగస్ పత్రాలతో రాజధానిలోని ఖరీదైన భూముల కబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న హైకోర్టు న్యాయవాది శైలేష్ సక్సేనా పోలీసు కస్టడీ గురువారంతో ముగిసింది. భూకబ్జా కేసుల్లో ఇతడు గతంలోనే అరెస్టు కాగా... తాజాగా హైకోర్టు నుంచి ఫైళ్ల మాయం కేసులో కటకటాల్లోకి చేరాడు. ఇతడి కారును స్వాధీనం చేసుకుని అందులో గాలించిన సీసీఎస్ పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. కేసుల దర్యాప్తు పక్కదారి పట్టించడంతో పాటు పోలీసు అధికారులను నైతికంగా దెబ్బతీయడానికి శైలేష్ వారిపై అనేక రిట్ పిటిషన్లు, మూడు ప్రైవేట్ కంప్‌లైట్లు దాఖలు చేసిన విషయం విదితమే. ఇవన్నీ హబీబ్ ఇస్లాం ఖాన్, నజీరుద్దీన్ ఇస్లాం ఖాన్, ఇఫ్తెకార్ ఇస్లాం ఖాన్ పేర్లతో దాఖలయ్యాయి. ఆ రిట్ పిటిషన్లతో పాటు ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆధార్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డులను సైతం జత చేశారు. ఈ కేసులు శైలేష్ సక్సేనా దాఖలు చేస్తున్నట్లు పోలీసులు కొన్ని రోజులుగా అనుమానిస్తున్నారు.
తాజాగా అతడి కారును తనిఖీ చేయగా ఈ మూడు పేర్లతో ఉన్న గుర్తింపుకార్డులు లభించాయి. పాతబస్తీలోని యాకత్‌పుర చిరునామాతో ఉన్న మూడు ఓటర్ ఐడీలు, రాజేంద్రనగర్ చిరునామాతో మరో మూడు, పాన్ కార్డులు మూడు, కర్ణాటక నుంచి సంగ్రహించిన ఆధార్ కార్డులతో కలిపి మొత్తం 12 కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై హబీబ్ ఇస్లాం ఖాన్, నజీరుద్దీన్ ఇస్లాం ఖాన్, ఇఫ్తెకార్ ఇస్లాం ఖాన్ పేర్లే ఉన్నాయి. వీటి ఆధారంగానే పంజగుట్ట, మలక్‌పేట, రాజేంద్రనగర్ ఠాణాల్లో ప్రైవేట్ కంప్‌లైంట్స్, ఇతర రిట్ పిటిషన్లు దాఖలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే శైలేష్ సక్సేనా మాత్రం ఈ విషయాన్ని అంగీకరించకుండా తనకు ఏమీ తెలియదన్నట్లే వ్యవహరించాడు. యాకత్‌పుర చిరునామాకు వెళ్లి ఆరా తీయగా, అక్కడ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉంటున్నట్లు తేలింది. రాజేంద్రనగర్ చిరునామాలో సంప్రదించగా.. అక్కడ ఉంటున్న సయ్యద్ సిద్ధిఖీ అనే వ్యక్తి ఆ ముగ్గురూ తన బంధువులని, అప్పుడప్పుడు వచ్చి వెళ్తారని చెప్పు కొచ్చాడు. దీంతో ఈ ముగ్గురూ బోగస్ వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీలు, పాన్ కార్డుల ప్రతులతో ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖలకు లేఖలు రాశారు. వారి నుంచి వచ్చే జవాబుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరోపక్క శైలేష్ సక్సేనాను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు విచారించినా సరైన సమాధానాలు రాకపోవడంతో మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి సైతం నిందితుడిగా ఉన్నాడు. ఇతడి పాత్రను ఆరా తీయడం పైనా అధికారులు దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment