శ్రీనివాస రెడ్డి ఆధార్ కార్డు
సాక్షి, సిటీబ్యూరో: తనవి కాని భూములపై నకిలీ పత్రాలు సృష్టించడం... వీటిని కొన్ని కంపెనీలకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టడం... భారీ మొత్తం రుణంగా ఇప్పించి నిర్ణీత శాతం కమీషన్ తీసుకోవడం... ఈ పంథాలో వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి రూ.100 కోట్ల వరకు రుణాలు ఇప్పించి, భారీ మొత్తం కమీషన్‌గా తీసుకున్న శ్రీనివాస్‌రెడ్డిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్, రాచకొండతో పాటు ఏపీలో ఇతడిపై 15 కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. ఇతడి స్కాములపై పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు ఒకటిరెండు రోజుల్లో అరెస్టు చేయనున్నట్లు సమాచారం. మరోపక్క రాచకొండ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్న ఇతడి సంబంధీకులు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని, కేసులను కోర్టులో ఎదుర్కొంటామని కోరుతున్నట్లు సమాచారం.
ప్రధాన లోపాలను గుర్తిస్తాడు...
గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి నగరానికి వలసవచ్చి ఎస్సార్‌నగర్ ప్రాంతంలో ఉంటున్నాడు. తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న అతను ఆ వ్యాపారాన్ని పక్కకు పెట్టి మోసాలు చేయడం ప్రారంభించాడు. ప్రధానంగా హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని స్థలాలనే ఇతడు ఎంచుకుంటాడు. ఆయా స్థలాల్లో ఉన్న సాంకేతిక అంశాలు, చిన్న చిన్న లోపాలను గుర్తించే శ్రీనివాస్‌రెడ్డి వాటి పాత యజమానులను మభ్యపెట్టో, నకిలీ పత్రాలు సృష్టించి సదరు స్థలం తన పేరుతో ఉన్నట్లు డాక్యుమెంట్లు సిద్ధం చేసి, రుణాలు తీసుకునే కంపెనీలకు అవసరమైన కొలట్రల్ సెక్యూరిటీలు అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటాడు. ఆసక్తి చూసిన సంస్థల యజమానులతో కమీషన్‌పై ఒప్పందం చేసుకోవడంతో పాటు ఈ పత్రాలు ఇవ్వడం ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తాడు.
పరిశీలకుల ముందు పెద్ద సినిమా...
ఏదైనా సంస్థకు రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఏజెంట్ల ద్వారా కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టే స్థలాలను ఫీల్డ్ వెరిఫికేషన్ చేయిస్తాయి. దీని కోసం శ్రీనివాస్‌రెడ్డి పెద్ద సినిమా నడిపించేవాడు. ఈ వెరిఫికేషన్ బృందం రావడానికి ఒక రోజు ముందే ఆ ప్రాంతానికి వెళ్లే శ్రీనివాస్‌రెడ్డి అక్కడ ‘దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్రీనివాస్‌రెడ్డి’ అంటూ బోర్డులు ఏర్పాటు చేసేవాడు. ఆ చుట్టుపక్కల స్థలాల యజమానులంటూ కొందరు అద్దె మనుషులను రంగంలోకి దింపి వారికి సర్వే నెంబర్లు, విస్తీర్ణం కంఠతా అయ్యేలా తర్ఫీదు ఇచ్చేవాడు. దీంతో మరుసటి రోజు వెరిఫికేషన్‌కు వచ్చిన సిబ్బంది అక్కడ ఉన్న బోర్డు చూసి, ‘అద్దె యజమానులు’ చెప్పే వివరాలు తెలుసుకుని నిజమే అని నమ్మి రుణం మంజూరుకు సిఫార్సు చేసే వారు. ఇలా రుణం మంజూరైన తర్వాత శ్రీనివాస్‌రెడ్డి 10 నుంచి 25 శాతం వరకు ఆ కంపెనీ నుంచి కమీషన్‌గా తీసుకునేవాడు. ఈ పంథాలో ఎల్బీనగర్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని స్థలాలను కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టి రూ.100 కోట్లకు పైగా రుణాలు ఇప్పించిన శ్రీనివాస్‌రెడ్డి రూ.25 కోట్ల వరకు కమీషన్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వెలుగులోకి వచ్చింది ఇలా...
శ్రీనివాస్‌రెడ్డిపై గతంలోనే కేసులు ఉన్నాయి. అయితే తాజాగా ఇతడి భాగోతాలు ఓ బ్యాంకు అధీకృత లీగల్ అడ్వైజర్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఓ స్థలానికి సంబం«ధించిన పత్రాలను ఇస్నాపూర్ ఎస్‌బీహెచ్‌లో (ప్రస్తుతం ఎస్బీఐ) కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టిన శ్రీనివాస్‌రెడ్డి ఓ సంస్థకు రూ.18 కోట్ల రుణం ఇప్పించి రూ.66 లక్షలు కమీషన్‌గా తీసుకున్నారు. అదే స్థలంపై, మరో సెట్టు పత్రాలను ఇంకో సంస్థకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టడానికి సిద్ధమై రామాంతపూర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌లో దాఖలు చేశారు. ఈ రెండు బ్యాంకులకు లీగల్ ఒపీయన్ ఇచ్చే అధీకృత అడ్వైజర్ ఒకరే కావడంతో వారు అతను ఈ విషయాన్ని గుర్తించి ఎస్‌బీహెచ్ దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో రూ.18 కోట్ల రుణం పొందిన సంస్థ యజమానిని నిలదీసిన సదరు బ్యాంకు దాని ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు కంపెనీని నాన్–పెర్ఫామింగ్ అసెర్ట్‌గా (ఎన్‌పీఏ) ప్రకటించింది. దీంతో తీవ్రంగా నష్టపోయిన ఆ సంస్థ యజమాని కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టిన స్థలానికి సంబంధించి ఆరా తీయడంతో అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతానికి చెందిన వారికి విషయం తెలిసింది. దీంతో వారు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment