
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న అక్రమ గుర్తింపు కార్డుల జారీ దందాను గత నెలలో ‘సాక్షి’ గుట్టురట్టు చేసింది. నగదు చెల్లిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్ ఐడీ వంటి ఐడెంటిటీలను విక్రయిస్తున్న వ్యవహారంపై ‘అంగట్లో ఐడెంటిటీ’ శీర్షికన గత నెల 21న పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యవహారాన్ని అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి గుర్తింపు కార్డులతో ఎవరైనా పాస్‌పోర్టులు తీసుకున్నారా? అనే అంశంపై నగర టాస్క్‌ఫోర్స్ అధికారులు దృష్టి పెట్టారు. ఫలితంగా నార్త్‌జోన్ బృందానికి గురువారం ముగ్గురు ‘నకిలీరాయుళ్లు’ చిక్కారు. వీరు ఓటర్ ఐడీ, ఆధార్ వంటి నకిలీ గుర్తింపుకార్డులను సమర్పించి రెండు, మూడు చొప్పున పాస్‌పోర్టులు తీసుకున్నట్లు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు వెల్లడించారు. వీరి నుంచి ఏడు పాస్‌పోర్టులతో పాటు భారీ సంఖ్యలో బోగస్ ఐడెంటిటీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలాంటి వారు ఇంకా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని, త్వరలో వారినీ పట్టుకుంటామన్నారు. ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావుతో కలిసి తన కార్యాలయం వివరాలు వెల్లడించారు.
ఇలా రెండు, మూడు చొప్పున పాస్‌పోర్టులు పొందిన ఈ ముగ్గురూ ఆ విషయాన్ని దాచి ఉంచారు. గత నెలలో ప్రచురితమైన ‘సాక్షి’ కథనంతో స్పందించిన హైదరాబాద్ పోలీసులు ఇలాంటి ‘నకిలీ ఐడెంటిటీగాళ్ల’పై నిఘా ముమ్మరం చేశారు. నార్త్‌జోన్ టీమ్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కె.శ్రీకాంత్ తమ బృందాలతో లోతుగా ఆరా తీయగా నర్సింగరావు, సాలం, హైదర్ అలీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గురువారం వీరి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ముగ్గురినీ పట్టుకుని ఆధారాలతో సహా స్థానిక పోలీసులకు అప్పగించారు.
విదేశాలకు వెళ్లేందుకు అడ్డదారులు
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఎక్స్ రోడ్స్ ప్రాంతానికి చెందిన బండకాడ నర్సింగ్ రావు వృత్తిరీత్యా డ్రైవర్. అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనుకున్న ఇతను తొలుత బాల నర్సింగ్‌రావు పేరుతో పాస్‌పోర్ట్ పొంది వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని ఢిల్లీలోని కాన్సులేట్ అధికారులు తిరస్కరించడంతో ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించాడు. బెన్ని నర్సింగ్‌రావు పేరుతో నకిలీ గుర్తింపుకార్డులు, పత్రాలతో మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. దీని ఆధారంగా మరోసారి ఢిల్లీ కాన్సులేట్ నుంచి వీసా కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. అయినా తన పంథా మార్చుకోని నర్సింగ్‌రావు బోగస్ ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులతో సఫిల్‌గూడ చిరునామా, బీకే నర్సింగ్‌రావు పేరుతో మూడో పాస్‌పోర్ట్ పొందాడు. దీని ఆధారంగా వీసా కోసం దరఖాస్తు చేసినప్పటికీ కాన్సులేట్ తిరస్కరించింది.
వెంకటశర్మగా మారిన హైదర్ అలీ
అబిడ్స్ ప్రాంతానికి చెందిన హైదర్ అలీ లలానీ వృత్తిరీత్యా ఫుట్‌వేర్ వ్యాపారి. తన పేరుతోనే పాస్‌పోర్ట్ పొందిన ఇతను లండన్ వీసా సైతం తీసుకున్నాడు. ఈ పాస్‌పోర్ట్‌తో అమెరికాకు చెందిన బీ1 అండ్ బీ2 వీసా పొందడానికి కొన్ని అడ్డంకులు ఎదురవడంతో వెంకట శర్మగా మారాలని నిర్ణయించుకున్నాడు. తన ఫొటోనే వినియోగించి ఆ పేరుతో, జూబ్లీహిల్స్ చిరునామాతో నకిలీ ఐడెంటిటీలు పొందాడు. వీటి ఆధారంగా వీసా కోసం చెన్నై కాన్సులేట్‌లో దరఖాస్తు చేసుకున్నా సఫలీకృతుడు కాలేదు.
ఇంకా కొందరున్నారు
‘ఇలా నకిలీ ఐండెటిటీలతో పాస్‌పోర్ట్స్ పొంది, వాటి ఆధారంగా వీసాలకు దరఖాస్తు చేస్తున్న వారి కారణంగా నిజమైన దరఖాస్తుదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలోనే కాన్సులేట్లు అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో తిరస్కరిస్తున్నాయి. తద్వారా పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన ఎంక్వైరీలోనూ జాప్యం జరుగుతోంది. సాధారణంగా ఒక రోజులో పూర్తయ్యే విచారణ ఈ నకిలీలను గుర్తించడానికి కొన్ని రోజుల పాటు సాగే అవకాశం ఉంది. ఇలాంటి వారు ఇంకొందరు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. వారినీ పట్టుకుని కటకటాల్లోకి పంపిస్తాం’ – టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు
సలీంగా మారిన సాలం
మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సాలం సైతం నకిలీ ఐడెంటిటీల ఆధారంగా రెండు పాస్‌పోర్టులు పొందాడు. వ్యాపారిగా ఉన్న అతను మొదటిసారి తన వివరాలతోనే పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. దీని కాలపరిమితి యుగియడంతో రెన్యువల్ కూడా చేయించుకున్నాడు. యూఎస్‌కు చెందిన బీ1 అండ్ బీ2 వీసాలు పొందాలని భావించిన సాలం అడ్డదారుల్లో మహ్మద్ సలీం పేరుతో ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డుతో పాటు ఇతర ధ్రువీకరణలు పొందాడు. వీటి ఆధారంగా ఆ పేరుతో దరఖాస్తు చేసుకుని రెండో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. దీనిని వినియోగించి వీసా కోసం అప్‌లై చేయగా... అనివార్య కారణాల నేపథ్యంలో చెన్నై కాన్సులేట్ తిరస్కరించింది. రెండోసారి అసలు పాస్‌పోర్ట్‌తో దరఖాస్తు చేసుకున్నా ఇదే పరిస్థితి ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment