HYD Police Arrested Couple who Allegedly Trapped A Man And Duped Rs 1 Crore - Sakshi
Sakshi News home page

HYD: కళ్యాణిగా మారిన దాసు.. రూ. 50 కోట్ల ఆస్తి.. మాయమాటలు చెప్పి!

Published Wed, Nov 24 2021 8:16 AM | Last Updated on Wed, Nov 24 2021 9:59 AM

HYD Police Arrested Couple who Allegedly Trapped A Man And Duped Rs 1 Crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి ఏడాది కాలంలో రూ.కోటి వరకు స్వాహా చేసిన కిలాడి జంటను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. భార్యా భర్తలు కలిసే ఈ నేరం చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు. గుంటూరు జిల్లా సత్తుపల్లికి చెందిన వై.దాసు నూజివీడులోని టీటీటీఐ నుంచి బీటెక్‌ పూర్తి చేశాడు. కొండాపూర్‌లోని ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటుపడిన ఇతగాడు సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆపై పూర్తిగా రమ్మీకి బానిసగా మారిపోయాడు. 2017 నవంబర్‌లో ప్రైవేట్‌ టీచర్‌గా పని చేస్తున్న జ్యోతిని వివాహం చేసుకున్నాడు.
చదవండి: చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు   

ఆపై సత్తుపల్లికి మకాం మార్చి కొంత భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినప్పటికీ ఆన్‌లైన్‌ రమ్మీ మాత్రం మానలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019లో ఈ తరహా జూదాన్ని నిషేధించడంతో క్రికెట్‌ బెట్టింగ్స్‌ వైపు మళ్లాడు. వివిధ యాప్‌ల ద్వారా నిత్యం పందాలు కాసేవాడు. ఇతడు బీటెక్‌ చదువుతున్నప్పుడు కళ్యాణిశ్రీ పేరుతో తాను యువతిగా పేర్కొంటూ ఓ నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. దీని ద్వారా అనేక మంది యువకులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపి మోసం చేసేవాడు. ఇలా గతేడాది మేలో బొల్లారం ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పరిచయమయ్యాడు. తొలత ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా ఇరువురూ చాటింగ్‌ చేసుకున్నారు. ఆపై ఇరువురూ ఫోన్‌ నెంబర్లు మార్చుకున్న నేపథ్యంలో చాటింగ్‌ వాట్సాప్‌లోకి మారింది. కళ్యాణిశ్రీగానే చాటింగ్‌ చేసిన దాసు బాధితుడికి అనేక మాయమాటలు చెప్పి పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చాడు.
చదవండి: అసలే చలికాలం.. రాత్రి గజగజ వణకడమే.. మరి వారి సంగతేంటి?

అదును చూసుకుని అసలు కథ మొదలుపెట్టాడు. తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు చాలా ఉన్నాయంటూ చెప్పాడు. వాటి విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని నమ్మించాడు. అనివార్య కారణాల నేపథ్యంలో అవన్నీ తన పేరుతో లేవని చెప్పి..మ్యూటేషన్‌ ద్వారా ఆస్తులు తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని, ఆ మొత్తం ఇచ్చి సహకరించాలని చెప్పాడు. మనకు వివాహమయ్యే లోపు ఈ పని పూర్తి చేయాలన్నాడు. దీంతో బాధితుడు 2020 జూన్‌ నుంచి ఈ నెల వరకు మొత్తం రూ.కోటికి పైగా కళ్యాణిశ్రీగా చాటింగ్‌ చేసిన దాసు సూచించిన మూడు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాడు.

వీటిలో ఒకటి జ్యోతి పేరుతో ఉంది. అప్పుడప్పుడు బాధితుడికి కాల్స్‌ చేసిన దాస్‌ తన భార్య జ్యోతినే కళ్యాణిశ్రీగా మార్చి మాట్లాడించేవాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి దీన్ని దర్యాప్తు చేశారు. మంగళవారం భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు బాధితుడి నుంచి కాజేసిన సొమ్ముతో జల్సాలు చేయడంతో పాటు కొంత ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌కు వెచ్చించారు. రూ.4 లక్షలు వెచ్చించి సత్తుపల్లిలో భూమి కొన్నారు. జ్యోతి ఈ సొమ్ము వెచ్చించి 12 తులాల బంగారం ఖరీదు చేసిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement