పోలీసుల దాడిలో దిగ్భ్రాంతికర విషయాలు | A Family Imprisoned For Nine Years In Amsterdam | Sakshi
Sakshi News home page

9 ఏళ్లుగా చీకటి గదిలో కుటుంబం బందీ

Published Thu, Oct 17 2019 6:31 PM | Last Updated on Thu, Oct 17 2019 6:55 PM

 A Family Imprisoned For Nine Years In Amsterdam - Sakshi

జాన్‌ జోన్‌ కుటుంబం బందీగా ఉన్న ఫామ్‌హౌజ్‌ (ఇన్‌సెట్‌లో కిడ్నాపర్‌ జోసఫ్)

జాన్‌ జోన్‌ డార్‌స్టెన్‌కు సరిగ్గా పాతికేళ్లు ఉంటాయి. ఓ రోజు భయం భయంగా పొలాల గుండా పరిగెత్తుకుంటూ సమీపంలోని బార్‌ కెళ్లి. ఐదు బీర్లకు ఆర్డర్‌ ఇచ్చారు. సర్వర్‌ తీసుకొచ్చిన బీర్లను తీసుకున్నప్పటికీ ఆయన చేతులు వాటిని పట్టుకోలేక వణికిపోతున్నాయి. కౌంటర్‌ మీదున్న యజమాని ఆ విషయాన్ని గమనించి ఆ యువకుడి చేతిలోని బీర్లను తీసుకొని విషయం ఏమిటని ప్రశ్నించారు. సమీపంలోని ఓ ఫామ్‌ హౌజ్‌లో తన కుటుంబం బంధించి ఉందని, విడిపించాల్సిందిగా అడ్రస్‌ చెప్పి బీర్లు తీసుకొని పారిపోయారు. బార్‌ యజమాని క్రిస్‌ వెస్టర్‌బీక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి ఆ ఫామ్‌ హౌజ్‌ను తనిఖీ చేశారు. 

బార్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన పాతికేళ్ల జాన్‌ జోన్‌

అందులో ఓ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. గీత్‌ వాన్‌ డార్‌స్టెన్‌ అనే మధ్య వయస్కుడు, ఆయన ఐదుగురు పిల్లలు ఫామ్‌హౌజ్‌ సెల్లార్‌లోని ఓ చీకటి గదిలో బంధీలుగా ఉన్నారు. ఒక్క కిటికీ కూడా లేని ఆ చిన్న చీకటి గదిలో వారు గత తొమ్మిదేళ్లుగా బందీలుగా ఉన్న విషయం తెల్సి పోలీసులు అవాక్కయ్యారు. వారిలో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు మధ్యన ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. వారిలో పెద్దవాడే బార్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలోని రూయినర్‌వోల్డ్‌ చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం పొలాల్లోనే ఈ ఫామ్‌ హౌజ్‌ ఉంది. ఆ ఫామ్‌ హౌజ్‌లో చాలా గదులు ఉన్నప్పటికీ అన్ని గదుల్లోనూ కొత్తగా చేసిన ఫర్నీచర్‌ ఉంది. చిన్న చీకటి గదిలోనే వారిని బందీలుగా ఉంచారు. 

కిడ్నాపర్‌ జోసఫ్, జాన్‌ జోన్‌ కుటుంబం పక్కపక్కన అద్దెకున్న ఇల్లు

బందీల మాటలు గమ్మత్తుగా ఉన్నాయని, ఏదో దైవ భాష మాట్లాడుతున్నట్లు కలగా పులగంగా మాట్లాడుతున్నారని, వారి ఒక్క మాట కూడా తమకు అర్థం కావడం లేదని, వారిని వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులు తెలిపారు. బందీలు తామున్న గదిలోనే తిని, ఆ రూములోనే ఇంతకాలం పడుకున్నట్లు తెలుస్తోందని వారు చెప్పారు. ఇంతకాలం బయటి ప్రపంచానికి దూరం అవడం వల్ల వారు అలా మాట్లాడుతున్నారా ? మరేమైనా ఉందా ? అన్న విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. వారిని అలా బంధించినన వ్యక్తిని ఆస్ట్రియాకు చెందిన 58 ఏళ్ల జోసఫ్‌ బ్రన్నర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వృత్తిరీత్యా వడ్రింగి పనులు చేసుకొని బతికే జోసఫ్‌ ...16 ఏళ్ల క్రితం గీత్‌వాన్‌ డార్‌స్టెన్‌ కుటుంబం అద్దెకున్న పక్క అద్దెకు ఉండేవాడు. గీత్‌వాన్‌ చెక్క బొమ్మలు చేయడంలో మంచి నేర్పరి. ఆయన బొమ్మలు చెక్కితే జోసఫ్‌ చెక్క పడవులు తయారు చేసేవాడు. ఇద్దరు కలిసి వాటిని వాటిని విక్రయించేవారు. గీత్‌వాన్‌ నలుగురితో కలుపుగోలుగా ఉంటే జోసఫ్‌ మాత్రం ఎవరితో మాట్లాడేవాడు కాదు. పలకరించినా మాట్లాడకుండా తనపని తాను చేసుకొని పోయేవాడు. 2008లో అతను అద్దె ఇల్లు ఖాళీచేసి ఎటో వెళ్లి పోయాడు. 

జాన్‌ కుటుంబానికి చెందిన ‘నేచురల్‌ హోమ్స్‌’ షాపు

2010లో గీత్‌వాన్‌ కుటుంబం ఇళ్లు ఖాళీ చేసి ఎటో వెళ్లి పోయింది. అప్పుడే గీత్‌వాన్‌ కుటుంబాన్ని జోసఫ్‌ కిడ్నాప్‌ చేసి ఫామ్‌ హౌజ్‌లో బంధించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటికీ గీత్‌వాన్‌ భార్య బతికే ఉందని, ఆ తర్వాత కొంత కాలానికి ఆమె మరణించినట్లు ఆమె పెద్ద కుమారుడి కథనం ద్వారా తెలుస్తోంది. అయితే ఆమెను ఎక్కడ సమాధి చేశారో, కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదట. జోసఫ్‌ ఫామ్‌ హౌజ్‌ గేట్‌కు ఎప్పుడూ తాళం వేసి ఉంచేవాడని, ఎవరిని దరిదాపుల్లోని రానిచ్చేవాడు కాదని, ఇంటికి ఓ కెమేరాను కూడా అమర్చుకున్నాడని, పొరుగు పొలాల వారు తెలిపారు. 

జాన్‌ జోన్‌ వెళ్లిన బారు ఇదే (మీడియాతో మాట్లాడుతున్న బార్‌ యజమాని క్రిస్‌)

జోసఫ్‌కు ఓ ట్రక్కుందని, ఆ ట్రక్కులో వారానికి సరఫడా ఆహార పదార్థాలు, సరుకులు తెచ్చేవాడని, ఒక్కరికి అన్ని సరుకులు ఎందుకబ్బా! తమకు అనుమానం వచ్చేదని, మాట్లాడని ఆ మూర్ఖుడితో మాటలెందుకు పడాలని ఎప్పుడు ప్రశ్నించలేదని వారన్నారు. ఆ ఇంటిలో కాకుండా ఆరు మైళ్ల దూరంలో జోసఫ్‌ ఓ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసుకొని అక్కడే పనిచేసుకునే వాడని, వారానికి రెండు, మూడు సార్లకు మించి ఫామ్‌ హౌజ్‌లో కనిపించే వాడు కాదని, వచ్చినప్పుడు కూడా ఏవో ఇంటి మరమ్మతులు ఒంటరిగా చేస్తూ కనిపించే వాడని వారు తెలిపారు. ఆ ఇంటిలో ఇంత గూడుపుఠాణీ ఉందని తాము తెలుసుకోలేకపోయామని చెప్పారు. ఇంతకు ఆ ఫామ్‌హౌజ్‌ జోసఫ్‌ సొంతం కాదు. కిరాయికి తీసుకున్నది. నెల నెల టంచనుగా అద్దె చెల్లిస్తున్నందున తాము కూడా ఫామ్‌హౌజ్‌ను మధ్యలో తనిఖీ చేసుకోలేదని యజమాని తెలిపారు. 


పోలీసు అధికార ప్రతినిధి రమోనా

ఈ వింత సంఘటన వెనక సమాధానం లేని అనేక శేష ప్రశ్నలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. కుటుంబాన్ని బంధించిన గది తలుపుకు ఓ బండరాయి మాత్రమే అడ్డంగా ఉందని, దాన్ని తొలగించి తప్పించుకునే అవకాశం బందీలకు ఉన్నా కూడా వారు అలా చేయలేదని చెప్పారు. కనీసం గది బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. వారు తీవ్ర భయాందోళనలు, మానసిక ఆందోళనకు గురినట్లు మాత్రం కనిపిస్తోందని చెప్పారు. జ్వార్ట్‌లూయీ నగరంలో గీత్‌వాన్‌ కుటుంబానికి ‘నేచురల్‌ హోమ్స్‌’ పేరిట ఓ షాపు కూడా ఉంది. పోలీసులు ఇప్పుడు ఆ షాప్‌పై దాడిచేయగా, షాపును తాము గత పదేళ్లుగా అద్దెకు తీసుకొని నడుపుతున్నామని, కొత్తలో ఎవరో వచ్చి అద్దె తీసుకెళ్లే వారని, ఇప్పుడు ఎవరూ రావడం లేదని షాపు వారు చెప్పారట.


గీత్‌వాన్‌ పెద్ద కుమారుడు జాన్‌ జోన్‌ రెండు, మూడు సార్లు స్థానిక బారు వద్దకు వెళ్లి బీరు తాగాడట. అప్పుడు ఎవరికీ తమ బంధీ గురించి ఫిర్యాదు చేయలేదట. ఎందుకు ? 2010 వరకు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్న జాన్‌ జోన్‌ తాము రూయినర్‌వోల్డ్‌ పట్టణానికి షిప్ట్‌ అవుతున్నామని కూడా సోషల్‌ మీడియాలో 2010లో పేర్కొన్నారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాకు ఆయన పూర్తిగా దూరమయ్యారు. చీకటి గది నుంచి విముక్తి పొందిన తర్వాత గత జూలై నెల నుంచి జాన్‌ జోన్‌ మళ్లీ సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉన్నారు. అయనప్పటికీ తమ చీకటి జీవితం గురించి ఒక్క ముక్క కూడా ఆయన వెల్లడించలేదు. ఎందుకు ?

కిడ్నాపర్‌ జోసఫ్‌ బ్రన్నర్‌ను ఈ రోజు (గురువారం) ఆమ్‌స్టర్‌డామ్‌ కోర్టు ముందు విచారణకు హాజరుపర్చారు. ఆయన కోర్టుకు ఏమి చెప్పిందీ తెలియరాలేదు. కేసు దర్యాప్తులో పోలీసులకు ఏమాత్రం సహకరించని జోసఫ్‌ కోర్టు ముందు కూడా నోరు విప్పలేదని పోలీసుల అధికార ప్రతినిధి రమోనా తెలిపారు. కొన్ని కేసుల మిస్టరీ ఎప్పటికీ విడిపోదని, ఇది కూడా అలాంటిదే కావచ్చని ఆమె అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement