
రోదిస్తున్న భార్య, చిన్న కుమారుడు చరణ్ తేజ పరామర్శిస్తున్న పొన్నాల లక్ష్మయ్య
సాక్షి, జనగామ: డాడీ... అన్నయ్యా.. అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్న చిన్నోడు... భర్తను కోల్పోయి రోదిస్తున్న భార్య, బంధువుల రోదనలతో జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కంటతడి పెట్టింది. తండ్రీకొడుకుల మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అయ్యో..! బిడ్డా ఎంత పని జరిగిందంటూ భోరున విలపించారు. జనగామ మండలం యశ్వంతాపూర్ గ్రామానికి చెందిన తండ్రి బొట్ల వెంకటేష్, ఐదేళ్ల కుమారుడు సాయితేజ నీటి తొట్టెలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.
పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను శనివారం రాత్రి జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకుల మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలి రావడంతో అక్కడ విషన్న వదనాలు అలుముకున్నాయి. వెంకటేష్ బంధువు బొట్ల సుధాకర్ గుండె పోటుతో మృతి చెందగా.. అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. అంత్యక్రియలు పూర్తి చేసుకుని.. తిరిగి వచ్చే క్రమంలో నేషనల్ హైవే పనులను కోసం ఏర్పాటు చేసి సంపు వద్దకు వెళ్లగా ప్రమాదవ శాత్తు అందులో పడి ఇద్దరు మృతి చెందారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న వెంకటేష్, సాయితేజ విధి వక్రీకరించి... తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయి.. కుటుంబ సభ్యులకు పుట్టెడు దుఖాన్ని మిగిల్చారు.
మిత్రమా.. ఇక సెలవు..
ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకటేష్.. ఆయన కుమారుడు సాయితేజ మరణాన్ని తోటి స్నేహితులు తట్టుకోలేక పోతున్నారు. వెంకటేష్ చివరి చూపు కోసం ఆటో డ్రైవర్లతో పాటు చిన్న నాటి స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలివచ్చారు. ఇంటి ఆవరణలో మృతదేహాలను ఒకే చోట పడుకోబెట్టారు. వెంకటేష్ చిన్న కుమారుడు చరణ్ తేజ వారిని చూస్తూ.. అమ్మా ఏమైంది అంటూ.. అడుగుతుంటే.. అక్కడ ఉన్న వారి గుండెలను పిండేసింది. వెంకటేష్ తండ్రి.. సాయితేజ తాత ఇద్దరికి చివరి మజిలి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆర్థిక సాయం
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన తండ్రీకొడుకుల కుటుంబానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రూ.20వేలు ఆర్థిక సాయం చేయగా, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు బాల్దె సిద్దిలింగం, వీరేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్ కుమార్ రెడ్డిలు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కాగా నేషనల్ హైవే పనుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సంపు వద్ద ఎలాంటి చర్యలు లేక పోవడంతోనే తండ్రీకొడుకులు మృతి చెందారని గ్రామస్తులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment