కుమార్తెను హతమార్చిన తండ్రి అరెస్టు | Father Arrest In Daughter Murder Case chittoor | Sakshi
Sakshi News home page

కుమార్తెను హతమార్చిన తండ్రి అరెస్టు

Published Tue, Oct 23 2018 11:57 AM | Last Updated on Tue, Oct 23 2018 11:57 AM

Father Arrest In Daughter Murder Case chittoor - Sakshi

మెదక్‌ జిల్లా తుఫ్రాన్‌ వద్ద తండ్రి చేతిలో హత్యకు గురైన లక్ష్మీప్రసన్న (ఇన్‌సెట్‌) లక్ష్మీప్రసన్న(ఫైల్‌) నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి

చిత్తూరు, ములకలచెరువు: కన్నకూతురుని హతమార్చిన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. ములకలచెరువు మండలం బోరెడ్డిగారిపల్లెలో చెందిన శ్రీకాంత్‌రెడ్డి(44), పుణ్యవతి దంపతులకు లక్ష్మీప్రసన్న (14) ఒక్కగానొక్క కుమార్తె. బాలిక ములకలచెరువులోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శ్రీకాంత్‌రెడ్డి బోర్‌వెల్‌లో పనిచేస్తున్నాడు. భర్త తరచూ గొడవ పడుతుండడంతో పుణ్యవతి ఎనిమిదేళ్లుగా భర్తకు దూరంగా బెంగళూరులో ఉంటోంది. పెద్ద మనుషులు పంచాయితీ చేసినా ప్రయోజనం లేదు. శ్రీకాంత్‌రెడ్డి గత ఏడాది బోర్‌వెల్‌లో పనిచేస్తూ నాలుగు నెలలు మెదక్‌ జిల్లా తుఫ్రాన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో కుమార్తెను కూడా అక్కడికే తీసుకెళ్లి ప్రశాంతంగా జీవించాలని భావించాడు. ఈ నెల 2వ తేదీన కుమార్తెను తీసుకుని స్వగ్రామం నుంచి మెదక్‌ బయలుదేరాడు.

4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తుఫ్రాన్‌కి రెండు కిలోమీటర్ల దూరంలోనే బస్సు దిగేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళదామని కుమార్తెతో చెప్పాడు. చీకటిలో ఎలా వెళ్లేదని కుమార్తె నిలదీయడం, ఇంటికి వెళ్లిపోదామని గట్టిగా కోరడంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆగ్రహించిన తండ్రి గతంలో భార్య దూరమైందని, ఇప్పుడు కుమార్తె కూడా దూరమవుతుందేమోనని భావించాడు. దారి పక్కనే ఉన్న క్వారీలో బండరాయితో బాలిక తలమీద బాది చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. 5వ తేదీ ఉదయం క్వారీలోకి రాళ్లు కొట్టడానికి వెళ్లిన కూలీలు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను గమనించి తుఫ్రాన్‌ పోలీసులకు సమాచారం అందించారు. తుఫ్రాన్‌ సీఐ లింగేశ్వరరావు అక్కడికి చేరుకుని బాలికను 108 ద్వారా సికింద్రాబాదు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికను హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు.

అరెస్టు చూపించిన తుఫ్రాన్‌ పోలీసులు
కుమార్తె హత్యకు కారణమైన శ్రీకాంత్‌రెడ్డిని తుఫ్రాన్‌ సీఐ లింగేశ్వరరావు సోమవారం అరెస్టు చూపించారు. పలు సెక్షన్లు నమోదు చేసి రిమాండ్‌ తరలించినట్టు ఎస్‌ఐ ఈశ్వరయ్య పేర్కొన్నారు. కేసు ఛేదించిన ఎస్‌ఐ ఈశ్వరయ్య, సిబ్బంది వెంకటేష్, కుమార్‌ను అక్కడి ఉన్నతాధికారులు అభినందించారు.

హత్య బయటపడతాదనిపారిపోయిన నిందితుడు
శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన బోరెడ్డివారిపల్లెకు వచ్చాడు. కుటుంబ సభ్యులు కుమార్తె గురించి ఆరా తీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చింది. అతను కుమార్తె హత్య విషయం బయటపడతుందని గ్రహించి పారిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి భార్య పుణ్యవతిని బెంగళూరు నుంచి పిలిపించి ములకలచెరువు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఈశ్వరయ్య బాలిక అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్‌ లొకేషన్‌ ద్వారా శ్రీకాంత్‌రెడ్డిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుమార్తెను తానే హత్య చేసినట్లు శ్రీకాంత్‌రెడ్డి అంగీకరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement