
హంట్స్‌విల్లే: తన ఇద్దరు కూతుళ్లను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన వ్యక్తికి అమెరికాలో మరణ శిక్ష అమలుచేశారు. 2001 నాటి ఈ కేసులో దోషిగా తేలిన డాలస్‌కు చెందిన అకౌంటెంట్ జాన్ డేవిడ్ బాటాగ్లియా(62)కు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు. భార్య నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న బాటాగ్లియా ఓసారి తన కూతుళ్లు ఫేత్(9), లిబర్టీ(6) వద్దకు వచ్చి వారిని కాల్చి చంపాడు. ఆ సమయంలో భోజనం చేయడానికి వారి తల్లి మేరీ జేన్ పియర్లీ బయటికి వెళ్లింది. పియర్లీకి ఫోన్ చేసి మరీ కూతుళ్ల ఆర్తనాదాలను వినిపిస్తూ బాటాగ్లియా వారిని హత్య చేశాడు.
అవతలి వైపు పియర్లీ నిస్సహాయంగా ఫోన్‌లో.. చంపొద్దంటూ ఫేత్ తన తండ్రిని వేడుకుంటున్న మాటలను విన్నా ఏం చేయలేకపోయింది. బాటాగ్లియా(62) మానసిక స్థితి సరిగా లేదని మరణశిక్షకు అనర్హుడని, అతని తరఫు లాయర్లు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో టెక్సాస్‌లో తాజాగా శిక్షను అమలుపరిచారు. ఇది ఈ ఏడాది అమెరికాలో అమలుచేసిన మూడో మరణశిక్ష కావడం గమనార్హం. అన్నీ టెక్సాస్‌లోనే జరిగాయి.