
తన మానాన తాను వెళ్తున్న మూగ జీవిని వెంటాడారు. రెచ్చగొట్టి మరీ దానిపై కర్రలతో దాడి చేశారు. మృగ చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో విషయం వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...
కోల్‌కతా: సందర్‌బన్స్ నదీలో ఓ పులి నదిని ఈదుకుంటూ కెందో ఐలాండ్ వైపుగా వెళ్తోంది. అదే సమయంలో అటుగా పడవలో వెళ్తున్న కొందరు మత్స్యకారులు దానిని గమనించారు. గట్టిగా అరుస్తూ దానికి దగ్గరగా వెళ్లారు. తిక్క చేష్టలతో దానిని రెచ్చగొట్టడంతో అదికాస్త పడవవైపుగా దూసుకొచ్చింది. దీంతో పడవలో ఉన్న ఓ వ్యక్తి వెదురు బొంగుతో దానిని గాయపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుందని, అయితే గాయపడినప్పటికీ అది ఈదుకుంటూ ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. పులిని గాయపరిచిన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసి,వన‍్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ నిలన్‌జన్ మల్లిక్ తెలిపారు.