ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న ఓ వ్యక్తి మరణానికి సంబంధించి అతడి కూతురు(4), ఇరుగుపొరుగు వారు చెప్పిన వివరాల ఆధారంగా.. నోయిడా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి అంత్యక్రియలను నిలిపివేసి శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. వివరాలు.. బులంద్‌షహర్‌కు చెందిన సంతోశ్ రాఘవ్ అనే వ్యక్తి భార్య మమత, కూతురు(4), కొడుకు (2)లతో కలిసి సెక్టార్ 93లో నివాసం ఉంటున్నాడు. సంతోశ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా మమత కూడా కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పని పూర్తి చేసుకుని శనివారం రాత్రి మమత టెర్రస్‌పైకి వచ్చే సరికి సంతోశ్ రాడ్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో మద్యం మత్తులో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించింది. ఈ విషయం గురించి బంధువులకు సమాచారం అందించింది.
వాళ్లిద్దరు నాన్నను చంపేశారు
సంతోశ్ శవాన్ని తమ స్వగ్రామానికి తీసుకువెళ్లే క్రమంలో అతడి సోదరి సీమా రానా మేనకోడలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ నా సోదరుడి అంత్యక్రియలు నిర్వర్తించేందుకు శవాన్ని తీసుకుని రెండు కార్లలో బయల్దేరాం. అప్పటి వరకు నిద్రపోయిన నా మేనకోడలు లేచిన తర్వాత నాన్న ఎక్కడ అంటూ మమతను అడిగింది. నాన్న నాకు పాఠం చెబుతున్నపుడు ఇద్దరు అంకుల్స్ మన ఇంటికి వచ్చారు. ఒకరు లావుగా, మరొకరు సన్నగా ఉన్నారు. నాన్నను పైకి తీసుకువెళ్లారు. నేను వస్తానంటే వద్దన్నారు. సీసాలు తెచ్చారు. అక్కడే నాన్నను కొట్టి చున్నీ మెడకు వేశారు అని చెప్పింది’అని పేర్కొంది. కాగా ఈ కేసులో సంతోశ్ పక్కింటి వ్యక్తులు కూడా అతడి కూతురు చెప్పిన వివరాలే చెప్పడంతో అనుమాననాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నోయిడా పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment