సాక్షి బెంగళూరు: అప్పు చేయడం ఏకంగా కాపురాన్నే కూల్చేసింది. రూ. 500 అప్పు కట్టనందుకు స్నేహితుడి భార్యను కిడ్నాప్‌చేసి పెళ్లి చేసుకున్న సంఘటన బెళగావి జిల్లాలో జరిగింది. గోకాక్ తాలూకా మిడకనట్టి గ్రామానికి చెందిన రమేశ్ హుక్కేరి అనే వ్యక్తి మురుకిబావి గ్రామానికి చెందిన బసవరాజ కొనన్న అనే వ్యక్తి భార్యను పెళ్లాడాడు. బెళగావిలోని ఒక హోటల్‌లో పనిచేస్తుండగా రమేశ్, బసవరాజలు ఒకరినొకరు పరిచయం అయ్యారు. ఇదే హోటల్‌లో పనిచేస్తున్న బసవరాజ భార్య పార్వతితో రమేశ్‌కు పరిచయం ఏర్పడింది.
ఓసారి డబ్బులు అవసరమై రమేశ్ వద్ద బసవరాజు రూ. 500 అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య పలు సార్లు వివాదం జరిగింది. అప్పు చెల్లించలేదనే కారణంతో బసవరాజు భార్య పార్వతిని రమేశ్ తీసుకెళ్లి ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై రమేశ్‌ను ప్రశ్నిస్తే తనపై దాడులకు దిగుతున్నాడని బసవరాజు ఆరోపిస్తున్నాడు. తన భార్య కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్కడ తన ఫిర్యాదును స్వీకరించడం లేదని వాపోయాడు. బసవరాజు, పార్వతిలకు 2011లో వివాహం కాగా, మూడేళ్ల కూతురు కూడా ఉంది. అతని బారి నుంచి తన భార్యను కాపాడి తెచ్చివ్వాలని బాధితుడు విలపించాడు.
Comments
Please login to add a commentAdd a comment