సాక్షి, విజయవాడ : నగరంలో గంజాయి అమ్మకాల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. పలువురు బీటెక్ విద్యార్థులు గంజాయి విక్రేతలుగా మరినట్టుగా టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో బయటపడింది. విజయవాడ పరిసరాల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. అందులో పట్టుబడ్డ ఒక బీటెక్ విద్యార్థిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విద్యార్థి చెప్పిన వివరాలు విని పోలీసులు షాక్ తిన్నారు. 2 నుంచి 4 కిలోల గంజాయి తీసుకోచ్చి వాటిని ప్యాకెట్లుగా మార్చి కాలేజీల్లో అమ్మకాలు చేపడుతున్నట్టుగా సదురు విద్యార్థి పోలీసుల విచారణలో వెల్లడించారు.
మరోవైపు గంజాయి అమ్మకాలతో సంబంధం ఉన్న పదిమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఆరుగురు బీటెక్ విద్యార్థులు ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. అరకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా గంజాయి కొనుగోలు చేస్తున్న బీటెక్ విద్యార్థులు.. వాటిని కాలేజ్‌లోని తమ సహచరులకు విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఐదు కాలేజ్‌ల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గన్నవరం, తెల్లప్రోలు, కానూరు, మొగల్రాజపురం ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజ్‌ల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నాలుగు నెలల క్రితం నలుగురు విద్యార్థులు ఇదే విధంగా పట్టుబడగా పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయిన గంజాయి అమ్మకాలు యథావిధిగా కొనసాగుతుండటంతో.. గంజాయి అమ్మేవారితో విద్యార్థులకు ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment