సింగ్‌నగర్‌లో బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్న సీపీ టి.కె.రాణా, ఇతర పోలీస్ అధికారులు
సాక్షి ప్రతినిధి విజయవాడ: వారికి గంజాయితో నిత్యం సహవాసం.. జన సంచారం అంతగాలేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారే లక్ష్యం.. డబ్బులు ఇవ్వలంటూ బ్లేడుతో దాడి చేయడం, పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నిస్తే తమను తాము కోసు కుని చస్తామంటూ బెదిరించడం వారికి సహజం.. ఇదీ విజయవాడలో హల్‌చల్ చేసే బ్లేడ్‌బ్యాచ్ సభ్యుల నైజం. నగరంలో అలజడి సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బ్లేడ్ బ్యాచ్ సభ్యుల కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టారు. వారి మూలాలను శోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్వయంగా రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగేవారు ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
ఇప్పటికే నగరంలో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలకు, గంజాయి తాగేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలైన వన్ టౌన్, టూ టౌన్, రైల్వే అప్ యార్డు, సీపీఆర్ ఫ్లై ఓవర్, ఆర్‌పీఎఫ్ పోస్టు, రామరాజ్యనగర్‌లోని రైల్వే బ్రిడ్జ్ కింద ఖాళీ ప్రదేశాలు, జక్కంపూడి శివారులోని 60, 40 అడుగుల రోడ్ల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నేర చరిత్ర ఆధారంగా బ్లేడ్ బ్యాచ్ సభ్యులను ఆయా పోలీస్‌స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోలీస్ కమిషనర్ టి.కె.రాణా వన్‌టౌన్, సింగ్‌నగర్ ప్రాంతంలో బ్లేడ్‌బ్యాచ్, గంజాయి తాగేవారికి ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి కదలికలు ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో సీపీ స్వయంగా పర్యటించి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.
సన్మార్గంలో నడిస్తే ఉపాధి
బ్లేడ్ బ్యాచ్ సభ్యులు నేర ప్రవృత్తిని మార్చుకుని మంచి మార్గంలో నడవాలని నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆధ్వర్యంలో పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ జన జీవనానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి కఠిన దండన తప్పదనే సంకేతాలు పంపుతున్నారు. నేర ప్రవృత్తి మార్చుకోని వారిని ఉపేక్షించేది లేదని, అవసరమైతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు. మంచి మార్గంలో నడుచుకునే వారికి వ్యాపార సంస్థలతో మాట్లాడి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, వారి తల్లిదండ్రులను పిలిపించి పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.
ఆగడాలకు అడ్డుకట్ట ఇలా..
బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగి చెడ్డదారుల్లో నడిచేవారికి ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను సీపీ టి.కె.రాణా ఆదేశించారు. గంజాయి తాగేందుకు అనువుగా ఉండే ప్రదేశాలను గుర్తించి పోలీస్ గస్తీ పెంచాలని, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి పిల్లలు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసేలా తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు. గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి డీ–ఎడిక్షన్ సెంటర్లకు పంపాలని పేర్కొన్నారు. నేరాలు జరగడానికి అవకాశం ఉన్న చీకటి ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో స్థానిక అధికారులతో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలు తమ వంతు బాధ్యతగా...
చెడు నడత గల వ్యక్తుల సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు స్వయంగా లేదా, 100 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని సీపీ టి.కె.రాణా ప్రజలను కోరారు. మత్తు పదార్థాల విక్రేతలు, వినియోగదారుల వివరాలను, వీధుల్లో తిరుగుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే ఆకతాయిల వివరాలను పోలీసులకు తెలపాలని కోరారు. ఈ సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు.
చదవండి: బాబోయ్ ప్రైవేట్ ట్రావెల్స్.. అడ్డంగా దోచేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment