సాక్షి, సిటీబ్యూరో: ఓ నేరం జరిగింది, కేసు నమో దైంది, పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేశారు... అయినప్పటికీ కీలక నిందితులు చిక్కడం మాట అటుంచి కనీసం వారెవరన్నదీ గుర్తించడం సా«ధ్య ం కావడం లేదు... కీలక ప్రభుత్వ విభాగాల్లో ఉన్న వ్యవస్థాగత లోపాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. నకిలీ ఓటర్ ఐడీ కార్డులు పొందడానికి సంబంధించి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నమోదు చేసిన కేసు వ్యవహారమిది. ఆన్‌లైన్ ద్వారా ఓటరు గుర్తింపుకార్డులకు దరఖాస్తు చేసుకునే విధానంలో ఉన్న చిన్న లోపం కారణంగా ఈ కేసులో అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో కార్డుల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్‌ఎంసీ అధికారులపై అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల అధికారులే టార్గెట్‌గా...
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో నకిలీ ఓట్లు రిజిస్టరయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నాంపల్లి సహా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వీలున్నంత వరకు నకిలీ ఓటర్లను తొలగించింది. అయితే నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఫెరోజ్ ఖాన్ ఈ ఏడాది జనవరి 25న నకిలీ ఓటర్లకు సంబంధించి ఉదాహరణలు అంటూ రెండు పేర్లను బయటపెట్టారు. ఆ నియోజకవర్గంలోని ఓవైసీ నగర్‌లోని చిరునామా నుంచి మాజీ సీఈసీ ఓమ్ ప్రకాష్ రావత్, ప్రస్తుతం ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ పేర్లు, ఫొటోలతో నమోదై ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఆధారాలుగా డబ్ల్యూఆర్‌హెచ్2400372, డబ్ల్యూఆర్‌హెచ్2400380 నెంబర్లతో ఓటర్ స్లిప్పులను సైతం చూపాడు.
సీసీఎస్‌లో కేసు నమోదు...
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణకు ఆదేశించింది. నగరానికి సంబంధించిన ఓటర్ జాబితాలు, నమోదు అంశాలను జీహెచ్‌ఎంసీ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ సదరు అధికారులను ఆదేశించారు. దీంతో జీహెచ్‌ఎంసీ మెహదీపట్నం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మహ్మద్ ఖాజా ఇంకెషాఫ్ అలీ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీలోని 419, 465, 471 సెక్షన్లతో పాటు ఆర్పీ యాక్ట్‌లోని సెక్షన్ 31, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ రెండు పేర్లు నమోదుకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు వచ్చినట్లు గుర్తించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలోనే సీసీఎస్ పోలీసులు తమ కేసులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్‌ను చేర్చారు.
అంతు చిక్కని ఐపీ అడ్రస్...
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీసీఎస్ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓమ్ ప్రకాష్ రావత్, రజత్‌కుమార్‌ల పేర్లు, వివరాలతో ఓటర్‌కార్డుల కోసం వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తులు ఏ ఐపీ అడ్రస్ నుంచి అప్‌లోడ్ అయిందో తెలుసుకోవడంపై దృష్టి సారించారు. సాధారణంగా ఏ ఆన్‌లైన్ కార్యకలాపం/ లావాదేవీ అయినా కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా జరుగుతుంది. వీటి నుంచి ఇంటర్‌నెట్‌ను వినియోగించినప్పుడు సంబంధిత ఐపీ అడ్రస్ కార్యకలాపం ఏ సంస్థకు చేరిందో అక్కడ నిక్షిప్తం అవుతుంది. అయితే ఓటర్ గుర్తింపుకార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సర్వర్‌లో మాత్రం ఇది నిక్షిప్తం అయ్యేలా ప్రొగ్రామింగ్ చేయలేదు. ఫలితంగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో వచ్చినట్లు గుర్తించినా ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చాయో తెలియట్లేదు. ఈ కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదు.
అధికారుల నిర్లక్ష్యంపై చార్జ్‌షీట్...
ఈ ఐపీ అడ్రస్ తెలిస్తేనే దాని ఆధారంగా అది ఏ కంప్యూటర్/సెల్‌ఫోన్‌కు సంబంధించింది తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. ఆపై సాంకేతికంగా దర్యాప్తు చేస్తేనే అసలు నిందితులను పట్టుకునే అవకాశం ఉంది. అయితే నకిలీ ఓటర్ గుర్తింపుకార్డుల వ్యవహారంలో ఐపీ అడ్రస్‌లే దొరక్కపోవడంతో దర్యాప్తు ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్ని జీహెచ్‌ఎంసీ అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతో ఓటర్ ఐడీలు జారీ చేయాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు నేరుగా ఐడీలు జారీ చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు ఈ వ్యవహారంలో ఆయా అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేల్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వారిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. వారు ప్రభుత్వ అధికారులు కావడంతో సర్కారు నుంచి ప్రాసిక్యూషన్‌కు అనుమతి వచ్చిన తర్వాతే కోర్టులో చార్జ్‌షీట్ వేసేందుకు ఆస్కారం ఉంది. ఈ మేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment