
పాట్నా: షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే బిహార్‌లో మరో దారుణం జరిగింది. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యాచార ఘటనలపై అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు హత్యాచార నిందితులకు తక్షణమే కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని నిరసనలు వ్యక్తమవుతుండగా..బీహార్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బక్సర్ జిల్లాలోని కుకుఢా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ఓ బాలికను అత్యాచారం చేసి చంపేసిన అనంతరం బాలికకు నిప్పంటించి తగలపెట్టారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఇలాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో కాలిన ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు బక్సర్ డీఎస్పీ సతీశ్‌కుమార్ తెలిపారు.
రాజధాని నగరం పాట్నాకు సుమారు 100కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతురాలు మైనర్, మేజర్ అనే విషయంపై స్పష్టత వస్తుందని డీఎస్పీ తెలిపారు. చాలా మంది స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నా.. మృతురాలిని మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారు. అత్యాచారం చేసిన తర్వాత గన్‌తో తలపై కాల్చి ఆమెకు నిప్పంటించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.