
సాక్షి,లక్నో: యూపీలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. అయిదుగురు వ్యక్తులు తనను లైంగింకంగా వేధించడాన్ని అడ్డుకున్న ఓ యువతిపై దుండగులు కాల్పులు జరిపారు. లక్నోకు సమీపంలోని మలీహాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు.
బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు లక్నో రూరల్ ఎస్‌పీ సతీష్ కుమార్ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికలు వస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయన్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.కాగా,యూపీలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఉదంతాలు కొనసాగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.