చోరీ జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న ఎస్‌ఐ గోపాలుడు
సాక్షి, గుత్తి: ముసుగు ధరించిన దొంగలు గుత్తిలో హల్‌చల్ చేశారు. అర్ధరాత్రి వేళ తాళం వేసిన ఇంటిలోకి చొరబడ్డారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రోడ్డులో పరుపుల తయారీదారుడు మస్తాన్‌వలి నివాసం ఉంటున్నాడు. వేసవి కావడంతో మస్తాన్‌వలి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి మంగళవారం రాత్రి మేడపై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు ఇంటి కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించారు. నాలుగు గదుల్లో ఉన్న బీరువాలను తెరిచి, అందులో దాచి ఉంచిన 13 తులాల బంగారు ఆభరణాలు (5 తులాల రాళ్ల నెక్లెస్, 3 తులాల సాదా నెక్లెస్, ఒకటిన్నర తులం చంప చారలు, తులం రాళ్ల కమ్మలు, తులం నల్లపూసల దండ, అర తులం డాలర్, అర తులం ఉంగరం, అర తులం జుంకీలు), 42 తులాల వెండి ఆభరణాలు (30 తులాల, 12 తులాల నాలుగు జతల వెండి పట్టీలు) తో పాటు 35 వేల నగదు అపహరించుకుపోయారు. బుధవారం సమాచారం అందుకున్న ఎస్‌ఐ గోపాలుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
బిహారీలే పనేనా..?
అనంతపురం క్లూస్‌టీం, వేలిముద్రల నిపుణులతో పాటు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి చోరీ జరిగిన ఇల్లు, పరిసరాలలో ఆధారాల కోసం అన్వేషించారు. చోరీ జరిగిన ఇంటి పక్కన సూపర్ మార్కెట్ ఉంది. అక్కడి సీసీ కెమెరాలో చోరీ ఉదంతం నిక్షిప్తమైంది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కిటికీని తొలగించి ఒక్కొక్కరుగా లోపలికి ప్రవేశించినట్లు తెలిసింది. వీరు ఆరు అడుగుల పొడవు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఆనవాళ్లను బట్టి దొంగలు బిహారీలై ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే రోడ్డులోనే హీరో బైక్‌ల షోరూంలో ఇలాంటి వ్యక్తులే ప్రవేవించి రూ.లక్షన్నర నగదుతో పాటు విలువైన వస్తువులు అపహరించారు. అపుడు కూడా సీసీ ఫుటేజీని పరిశీలించారు. మస్తాన్‌వలి ఇంటిలో చోరీ చేసిన దొంగలు, హీరో షోరూమ్‌లో చోరీ చేసి వ్యక్తులకు చాలా దగ్గరి పోలిక ఉన్నట్లు స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment