
పెళ్లి ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి..
సాక్షి బెంగళూరు: పెళ్లి ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి.. ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ సమయంలో పెళ్లి కుమారుడు తనకు ఎయిడ్స్ ఉందని, పెళ్లి రద్దు చేయాలని కోరాడు. దీంతో చేసేదేమీ లేక పెళ్లి వాయిదా వేశారు. వాస్తవానికి డిసెంబర్ 1న ఒక యువతితో నిందితుడు కిరణ్ కుమార్ వివాహం నిర్ణయం అయింది. కానీ పెళ్లికి మరో నాలుగు రోజులు ఉందనగానే నాటకీయంగా తనకు హెచ్‌ఐవీ సోకిందని అబద్ధం చెప్పి పెళ్లి నిలిచిపోయేలా చేశాడు. అయితే పెళ్లికి సదరు యువతి కుటుంబం సుమారు రూ. 15 లక్షల ఖర్చు చేసింది. దీంతో కిరణ్‌పై అనుమానంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు తీసుకున్న విజయనగర పోలీసులు.. కిరణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి హెచ్‌ఐవీ పరీక్ష చేయించారు. రిపోర్టు చూసి హెచ్‌ఐవీ లేదని నిర్ధారించుకున్నాక, యువతిని మోసం చేశాడనే ఆరోపణలపై విజయనగర పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేశారు.