పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎయిర్ పిస్టల్, గన్ పోలీసులు అదుపులో టి.రాజబాబు
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్ : ఆస్తి వివాదంలో ఒక వ్యక్తి గన్‌తో చంపుతానని బెదిరించినట్టు మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు బెదిరించిన వ్యక్తి ఇంటికి వెళ్లగా పిస్టల్, గన్ దొరికాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అవి ఎయిర్ పిస్టల్, గన్‌లుగా నిర్ధారించారు. వన్‌టౌన్ ఎస్సై పి.అప్పారావు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విస్సాకోడేరుకు చెందిన ఉగ్గు శ్రీనివాస్‌కు భీమవరం పీపీ రోడ్డులోని సెయింట్ మేరీస్ స్కూల్ వద్ద 163 గజాల స్థలం ఉంది. 2009లో శ్రీనివాస్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని అతని అన్నయ్య సురేష్‌బాబు ఆ స్థలాన్ని రాయించుకున్నాడని తెలిపారు.
దీనిపై శ్రీనివాస్ అక్క కట్టా సత్యవతి ఆ స్థలంలో తనకూ వాటా ఉన్నట్టుగా కోర్టులో సివిల్ కేసు వేశారు. ఈ స్థలం విషయంలో వారి మధ్య తగదా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తన్నేరు రాజబాబు ఈ కేసును, సమస్యలను పూర్తిగా తొలగిస్తానని, ఆ స్థలాన్ని అప్పగిస్తానని చెప్పి తన వద్ద సంతకాలు తీసుకున్నాడని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనకు తెలియకుండా ఆ స్థలాన్ని రాజబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. ఈ విషయమై ఈ నెల 7న శ్రీనివాస్ తన భార్యతో కలిసి రాజబాబు ఇంటికి వెళ్లి ప్రశ్నించగా అతడు గన్ తీసుకువచ్చి చంపుతానని బెదిరించాడని, అతని అత్త యాళ్ల కనకదుర్గ చాకుతో బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. దీనిపై నిందితుడి ఇంటికి వెళ్లి ఎయిర్ పిస్టల్, గన్ స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment