జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం  | Gunfire out in the jewelery shop | Sakshi
Sakshi News home page

జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం 

Published Wed, Sep 19 2018 2:32 AM | Last Updated on Wed, Sep 19 2018 2:32 AM

Gunfire out in the jewelery shop - Sakshi

రాథోర్‌ జ్యువెలరీ షాపును పరిశీలిస్తున్న పోలీసులు

కీసర: హైదరాబాద్‌ నగర శివారులో పట్టపగలే దొంగలు బరితెగించారు. జ్యువెలరీ షాప్‌లో చోరీ యత్నం విఫలం కావడంతో కాల్పులకు తెగబడ్డారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలోని ఆర్‌.ఎస్‌.రాథోర్‌ షాపులో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం జ్యువెలరీ షాపుకు సమీపంలో ఆరుగురు దుండగులు మూడు బైక్‌లపై వచ్చి ఆగారు. ఇద్దరు వ్యక్తులు రెండు తుపాకులు జేబుల్లో పెట్టుకొని షాపులోకి వెళ్లారు. మిగతా నలుగురు  షాప్‌నకు ఇరువైపులా నిల్చుండి పరిసరాలను గమనిస్తున్నారు. లోనికి వెళ్లిన దుండుగులు రూ.15 వేల విలువ చేసే బంగారు గొలుసు కావాలంటూ హిందీలో మాట్లాడు తూ షాపింగ్‌ చేస్తున్నట్టు నటించారు.

వారి మాటలు తడబడటాన్ని యజమాని రూప్‌సింగ్‌ గమనించాడు.  వచ్చింది దొంగలేనన్న అనుమానంతో రూప్‌సింగ్‌ ఎదురుతిరిగి అరిచేందుకు ప్రయత్నించాడు. వెంటనే దుండగులు తలపై గన్‌ పెట్టేందుకు యత్నించగా రూప్‌సింగ్‌ ఆ దుండగుడితో కలబడి తుపాకీ లాక్కున్నాడు. పక్కనున్న దుకాణం యజమానురాలు తులసీదేవి అదే సమయంలో జ్యువెలరీ షాప్‌లోకి వస్తోం ది. బయట కాపాలా ఉన్న దుండగులు ఆమె రాక విషయాన్ని లోపలున్న దొంగలకు చేరవేశారు. వెంటనే తుపాకీతో కాల్పులు జరిపి జనాలను భయభ్రాంతులకు గురిచేసి బైక్‌లపై పారిపోయారు. ఈ క్రమంలో దుకాణానికి 200 మీటర్ల దూరంలో వారి బైక్‌ అదుపు తప్పటంతో ఇద్దరు దుండగులు కిందపడ్డారు. వెంటనే తేరుకుని అటుగా వెళుతున్న శ్రీకాంత్‌ అనే యువకుడి బైక్‌ను లాక్కున్నారు. అతడిపై పిడిగుద్దులు కురిపించి బైక్‌పై పరారయ్యారు. 

యజమాని సమయస్ఫూర్తితో..
రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్, అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్‌రావు, ఏసీపీ శివకుమార్‌లు ఘటనాస్థలికి చేరుకొని చోరీకి యత్నించిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ శాస్త్రీయ ఆధారాలు సేకరించారు.  మాటల తీరును బట్టి ఆ దొంగలు ఉత్తర భారతీయ ముఠాకు చెందినవారేనని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. వారు వదిలి వెళ్లిన గన్‌ 3.2ను, పల్సర్‌ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసున్నారు. యజమాని   సమయస్ఫూర్తి వల్ల ప్రాణనష్టంతోపాటు భారీ చోరీ తృటిలో తప్పిందని కమిషనర్‌ అన్నారు. దుండగుల ఆచూకీ తెలిపినవారికి రూ.50 వేల నగదు బహుమతి అందజేస్తామని, 949061 7111 నంబర్‌కు సమాచారం అందించాలని సీపీ మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement