చిత్రంలో డీఎస్పీ బాలచంద్రారెడ్డి, సీఐ శివగణేష్, రూ.కోటి సొత్తును పరిశీలిస్తున్న ఎస్పీ సుబ్బారెడ్డి
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ఆ ముగ్గురూ పలు చోరీ కేసుల్లో నిందితులు. జైలులో శిక్ష అనుభవించిన సమయంలో వారి మధ్య స్నేహం కుదిరింది. చోరీల ద్వారా కాజేసిన బంగారు నగలు, వెండి వస్తువులతో ఎప్పటికైనా కర్ణాటక రాష్ట్రంలో ఓ జ్యూయలరీ షాపు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 25 చోరీల్లో దోచుకున్న సొత్తుతో కారులో కర్ణాటకకు బయలుదేరారు.
చదవండి: పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య
ఈ క్రమంలో రామచంద్రపురం డివిజన్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.కోటి సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. అమలాపురంలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ కేఎఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, మండపేట సీఐ పి.శివగణేష్ ఈ దొంగల ముఠా చోరీల చిట్టాను వివరించారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును విలేకర్లకు చూపించారు. వీరు దోచుకున్న బంగారు నగలు, వెండి వస్తువులు, బంగారం కరిగించే పరికరాలు జ్యూయలరీ షాపును తలపించింది.
ఇదీ చోరీల నేపథ్యం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరం గ్రామానికి చెందిన తోటకూర రామకృష్ణంరాజు, నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన సద్దుల కుమార్‌రాజాలు 2016లో పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి పోలీసు స్టేషన్ పరిధిలో పలు చోరీ కేసులలో పోలీసులకు పట్టుబడ్డారు. పది నెలల జైలు శిక్ష అనుభవించి, బయటకు వచ్చాక వారికి నర్సాపురంలో బంగారం కరిగించే వ్యక్తి.. కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన విజయ్ తవారు పవార్‌తో పరిచయం ఏర్పడింది. దొంగ సొత్తును కొనుగోలు చేసే రిసీవర్‌గా పవార్‌తో వారి అనుబంధం పెరిగింది. 2018లో ఈ ముగ్గురూ రాజోలు పోలీసు స్టేషన్‌లో పరిధిలో పలు చోరీల్లో అరెస్టయ్యారు. ఆ సందర్భంగా వారికి జైలుశిక్ష పడింది. దీంతో వారి స్నేహం మరింత బలపడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ముగ్గురూ కలిసి చోరీలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రామచంద్రపురం, అమలాపురం పోలీసు డివిజన్ల పరిధిలో 25 చోరీలు చేసి రూ.కోటి విలువైన సొత్తు కూడగట్టారు.
ఇలా పట్టుబడ్డారు
చోరీల్లో దోచుకున్న 1,360 గ్రాముల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు, రూ.40 వేలు నగదు, బంగారం కరిగించే పరికరాలు, కట్టర్లు, రాడ్లు తదితర సామగ్రితో ఓ కారులో సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రానికి ఆ ముగ్గురూ బయలుదేరారు. అక్కడ జ్యూయలరీ షాపు పెట్టాలన్నది వారి లక్ష్యం. వారి కారు అంగర పోలీసు స్టేషన్ పరిధిలోని టేకి గ్రామ శివారుకు వచ్చేసరికి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వీరి కారుపై అనుమానం వచ్చి ఆరా తీశారు. మండపేట సీఐ శివగణేష్, అంగర, ఆలమూరు ఎస్సైలు బి.సంపత్‌కుమార్, ఎన్.శివప్రాద్‌లు ఆ కారు నంబరును ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి, తప్పుడు నంబరుగా గుర్తించారు.
దీంతో కారును, కారులోని సొత్తును, ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని లోతుగా విచారించడంతో వారు ఐదేళ్ల నుంచి చేస్తున్న చోరీల చిట్టా వెలుగు చూసింది. ఈ ముఠా ఆలమూరు పోలీసు స్టేషన్ పరిధిలో 6, మండపేట రూరల్‌లో 2, అంగర పరిధిలో 3, రాయవరం పరిధిలో 1, మండపేట పట్టణ పరిధిలో 1, ద్రాక్షారామ పరిధిలో 1, పామర్రు పరిధిలో 2, రామచంద్రపురం పరిధిలో 1, అల్లవరం పరిధిలో 2, పి.గన్నవరం పరిధిలో 4, కడియం పరిధిలో 1, భీమవరం పరిధిలో 1 చొప్పున చోరీలు చేసినట్టు గుర్తించారు. వారిని సోమవారం అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment