
చిన్నారి సింధు వీపుపై గాయాలు
అమ్రాబాద్ (అచ్చంపేట): గిరిజన మినీ గురుకులంలో చదువుతున్న ఓ చిన్నారిని సిబ్బంది చితకబాదారు. ఈ సంఘటన మండలంలోని ఎల్మపల్లి గిరిజన మినీ గురుకులంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. మండలంలోని ఉప్పునుంతల(బీకే) గ్రామానికి చెందిన సింధు మినీ గురుకులంలో రెండో తరగతి చదువుతుంది. శనివారం తల్లి బుజ్జి తన కూతుర్ని పండగ కోసం తీసుకువెళ్లడానికి గురుకుల పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని వీపుపై గాయాలు కనిపించడంతో ఈ విషయం బయటపడింది.
ఈ విషయమై చిన్నారి అర్ధరాత్రి మూత్రం చేసేందుకు వెళ్లగా సిబ్బంది కొట్టారని పేర్కొంది. ఎవరికైనా చెబితే మళ్లీ కొడతారేమోనని చెప్పలేదని వాపోయింది. చిన్నారి బాలిక అని చూడకుండా ఇలా చితకబాదడం ఏమిటని విద్యార్థిని తల్లి వాపోయింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అయితే సింధు వీపుపై చితకబాదిన గాయాలు ఉన్నమాట వాస్తవమేనని ఎవరు.. ఎందుకు కొట్టారో తెలియదని హెచ్‌ఎం శోభ పేర్కొంది. ఈ విషయమై సీఐ రమేష్‌కొత్వాల్ స్పందిస్తూ ఈ విషయమై ఫిర్యాదు రాలేదని, విచారణ చేయాలని ఎస్‌ఐ రాంబాబుకు సూచించారు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున మన్ననూర్ బాలికల గురుకుల పాఠశాలలోకి ఓ యువకుడు ప్రవేశించిన ఘటన మరవక ముందే గురుకులంలో చిన్నారిని చితకబాదడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment