ఛండీగఢ్ : వారిద్దరు యువతులే. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసిఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్తే ఇద్దరు ఇరు కుటుంబాలు నిరాకరించారు. దీంతో ఒకరు లింగమార్పిడి చేయించుకొని పురుషుడిగా మారారు. అయినప్పటికీ వారి ఆశలు నెరవేరలేదు. ఈ జంట వివాహమాడిన కొద్ది నెలలకే భార్య పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్రమైన ఘటన హరియాణాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకు చెందిన 21 ఏళ్ల యువతి తన పాఠశాల స్నేహితురాలైన 19 ఏళ్ల యువతిని ప్రేమించింది. ఆమెను పెళ్లాడేందుకు గతేడాది లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని పురుషుడిగా మారింది. అనుకున్నట్లుగానే అక్టోబర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ కొంత కాలానికి భార్య తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయారు. దీంతో లింగమార్పిడి చేయించుకొని పురుషుడిగా మారిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన భార్యను ఆమె తల్లిదండ్రులు ఇంటికే పరిమితం చేశారని, తమను కలుసుకోనివ్వడం లేదని భర్త ఆరోపించారు. తాము పాఠశాలలో చదువుకొనే సమయం నుంచి ప్రేమలో ఉన్నామని తెలిపారు. ఆ ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోని విషయం వాస్తవమేనని అతని కుటుంబ సభ్యులు ఒకరు మీడియాకు చెప్పారు.
‘‘వారి పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఇద్దరిలో ఒకరు లింగమార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే వయసులో పెద్దదైన యువతి ఏడాది క్రితం ఢిల్లీలో శస్త్ర చికిత్స చేయించుకొని పురుషుడిగా మారింది. దీనికి రూ.10 లక్షలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని మేమే వివిధ మార్గాల ద్వారా సమకూర్చి ఇచ్చాం.’’ అని అతని కుటుంబ సభ్యుడు ఒకరు వివరించారు.
అయితే భార్య తన భాగస్వామితో కలిసి ఉండేందుకు తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయట్లేదని పోలీసులు తెలిపారు. లింగమార్పిడి చేయించుకొని భర్తగా మారిన భాగస్వామితో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని స్వయంగా ఆమె స్పష్టం చేసినట్లు తెలిపారు. మరోవైపు జంటను కలిపేందుకు న్యాయపరమైన పోరాటం చేస్తామని భర్త కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment