ఈఓడబ్ల్యూకు ‘హీరా’ కేసులు | Heera Cases Transfer To EOW | Sakshi
Sakshi News home page

ఈఓడబ్ల్యూకు ‘హీరా’ కేసులు

Published Wed, Oct 24 2018 9:14 AM | Last Updated on Tue, Oct 30 2018 2:07 PM

Heera Cases Transfer To EOW - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నౌహీరా షేక్‌పై ముంబైలో అక్కడి పోలీసులకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ముంబై పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులను అక్కడి క్రైమ్‌ బ్రాంచ్‌ ఆధీనంలోని ఆర్థిక నేరాల ప్రత్యేక విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌ స్కామ్‌ రూ.1000 కోట్ల వరకు ఉంటుందనే అనుమానాలు వెలువడుతున్నాయి. థానేలోని భివాండీలోని నిజాంపుర పోలీసుస్టేషన్‌లో హీరా గ్రూప్‌తో పాటు నౌహీరా షేక్‌పై తొలి కేసు నమోదైంది. రూ.80 లక్షలు మోసపోయిన ఎనిమిది మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం దీనిని రిజిస్టర్‌ చేశారు.

బాధితులందరూ హీరా గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లో పెట్టుబడిపెట్టి మోసపోయిన వారే. నూటికి రూ.36 చొప్పున వడ్డీ ఇస్తామంటూ ఎర వేసిన హీరా గ్రూప్‌ తమను మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. ఈ స్కామ్‌ పరిధిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఈ కేసును ఈఓడబ్ల్యూ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క వకోల, జేజే మార్గ్, అగ్రిపాడలతో పాటు ముంబై శివార్లలోని నేరుల్, పన్వేల్, నవీ ముంబై, మీరా–భయంద్రా, నలసోప్రా, పాల్‌ఘర్, థానే రూరల్‌ల్లో మరో వెయ్యి మంది వరకు హీరా బాధితులు ఇప్పటికే బయటకు వచ్చారు. వీరంతా ఆయా స్థానిక పోలీసుల వద్దకు వెళ్లి మౌఖిక ఫిర్యాదులు చేయగా, వారిని ఈఓడబ్ల్యూకు పంపాలని అక్కడి పోలీసులు నిర్ణయించారు. అక్కడే స్టేట్‌మెంట్స్‌ ఇప్పించడమో, ఫిర్యాదులు తీసుకుని ప్రత్యేక కేసులు నమోదు చేయించడమో చేయనున్నారు. మరోపక్క త దు పరి విచారణ నిమిత్తం నౌహీరా షేక్‌ను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్‌ పో లీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన నేపథ్యంలో న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించనుంది. ఇక్కడి కేసుల్లో అరెస్టులు విచారణలు పూర్తయిన తర్వాత నౌహీరాను ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌పై ముంబై తీసుకువెళ్లాలని అ క్కడి అధికారులు నిర్ణయించారు.  ఇక్కడి పరిణామాలను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సీసీఎస్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement