దేశ, విదేశాల్లో రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్‌కు బుధవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనివార్య కారణాల వల్ల ఆమె గురువారం కూడా విడుదల కాలేదు. ఈలోగా ముంబై, ఏపీ అధికారులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్లతో జైలు వద్దకు చేరుకున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ కేసులో కొత్త చిక్కువచ్చిపడింది. ఆమెకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసినా అనివార్య కారణాల నేపథ్యంలో గురువారం కూడా విడుదల కాలేదు. ఈలోగా ముంబై, ఏపీ అధికారుల ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్లతో జైలు వద్దకు చేరుకున్నారు. దీంతో ఆమె జైలు నుంచి బయటకు వస్తుందా? లేక మరో కేసులో వేరే ప్రాంత అధికారులు అరెస్టు చేస్తే మళ్లీ జైలుకు వెళ్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఈ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంకు ఖాతాల క్లోజింగ్ వెనుక ఉన్న గుట్టు రట్టు చేయడంపై దృష్టి పెట్టారు. గత వారం నౌహీరా షేక్‌ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం అనుమతి నిరాకరిస్తూ, ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 లక్షలతో రెండు ష్యూరిటూలు ఇవ్వాలని, ఈ నెల 29 లోగా న్యాయస్థానంలో రూ.5 కోట్లు డిపాజిట్ చేయాలని, పాస్‌పోర్ట్ అప్పగించడంతో పాటు అనుమతి లేకుండా దేశం దాటవద్దంటూ షరతులు విధించింది. ష్యూరిటీల దాఖలు, రిలీజ్ ఆర్డర్ తీసుకోవడం గురువారం పూర్తయినప్పటికీ అప్పటికే జైలు సమయం మించిపోవడంతో నౌహీరా విడుదల కాలేదు.
దీంతో ఈమె శుక్రవారం విడుదల అవుతారని ఆమె తరఫు న్యాయవాదులు భావించారు. ఇక్కడే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నౌహీరా షేక్‌లపై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. నౌహీరాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత థానేలోని భివాండీలో ఉన్న నిజాంపుర పోలీసుస్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. రూ.80 లక్షలు మోసపోయిన ఎనిమిది మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని గత శనివారం రిజిస్టర్ చేశారు. వీరందరూ హీరా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో పెట్టుబడిపెట్టి మోసపోయిన వారే. తమకు నూటికి రూ.36 చొప్పున వడ్డీ ఇస్తామంటూ ఎర వేసిన హీరా గ్రూప్ మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. మరోపక్క వకోల, జేజే మార్గ్, అగ్రిపాడలతో పాటు ముంబై శివార్లలో ఉన్న నేరుల్, పన్వేల్, నవీ ముంబై, మీరా–భయంద్రా, నలసోప్రా, పాల్‌ఘర్, థానే రూరల్‌ల్లో మరో వెయ్యి మంది వరకు హీరా బాధితులు ఆయా స్థానిక పోలీసుల వద్దకు వెళ్లి మౌఖిక ఫిర్యాదులు చేశారు.
దీంతో వీరిని ఈఓడబ్ల్యూకు పంపాలని అక్కడి స్థానిక పోలీసులు నిర్ణయించారు. నిజాంపుర పోలీసులు నౌహీరాపై పీటీ వారెంట్ తీసుకుని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈమెను కస్టడీలోకి తీసుకుని అక్కడకు తీసుకువెళ్ళాలని భావించారు. వీరితో పాటు తిరుపతి, కడపతో పాటు ఏపీ సీఐడీ పోలీసులు పీటీ వారెంట్లను జైలు అధికారులకు అందించారు. అయితే బెయిల్ మంజూరైన నిందితురాలిని పీటీ వారెంట్‌పై మరో పోలీసులకు అప్పగించవచ్చా? లేదా?అనే దానిపై స్పష్టత కోసం జైలు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే పీటీ వారెంట్‌పై లేదంటూ విడుదలైన తర్వాత అరెస్టు చేసి తమ ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి ఆయా పోలీసులు జైలు వద్ద కాపుకాశారు.
ఈ నేపథ్యంలోనే నౌహీరా తరఫు న్యాయవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం కేరళ, బెంగళూరు పోలీసులు సైతం అక్కడ నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్స్ తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు విధించిన షరతుల్లో ఈ నెల 27 నుంచి 30 వరకు ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు దర్యాప్తు అధికారి (సీసీఎస్ పోలీసులు) ముందు హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని ఉంది. ఇప్పుడు వేరే రాష్ట్ర పోలీసులు ఆమెను తీసుకువెళితే ఇలా హాజరుకావడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే అలా జరిగితే ఆయా రాష్ట్రాల్లో విచారణ పూర్తయిన తర్వాత నౌహీరాను మళ్లీ సిటీకి తీసుకువస్తారు. అప్పుడు విషయాన్ని కోర్టుకు తెలిపి మరోసారి తమ ముందు హాజరయ్యేలా ఆదేశాలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment