సాక్షి, సిటీబ్యూరో: ఆరేళ్లల్లో రూ.వేల కోట్ల టర్నోవర్ సాగించిన, బ్యాంకు ఖాతాల్లో కనీసం రూ.వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారంలో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ గ్రూప్ వ్యవహారాలన్నీ సీఈఓ నౌహీరా షేక్‌తో పాటు ఆమెకు అత్యంత సన్నిహితులైన బిజూ థామస్, మోలీ థామస్‌లకే తెలిసి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వీరితో పాటు కీలక సూత్రధారిగా ఉన్న మరో అజ్ఞాత వ్యక్తి విదేశాల్లో ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రస్తుతం ముంబైలో ఉన్న నౌహీరా షేక్‌ను సిటీకి తీసుకువచ్చేందుకు అవసరమైన అనుమతులు పొందటంపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. తిరుపతికి చెందిన నౌహీరా షేక్ హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఈమె 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ ఆమే నేతృత్వం వహిస్తున్నారు. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. అయినా ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు.
దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా రికార్డులు లేవు. నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. దీంతో డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయంపై దృష్టి సారించారు. ఈ వివరాలన్నీ ఆ ముగ్గురికే తెలిసి ఉంటాయని, నగదు దేశం దాటిందనే అనుమానాల నేపథ్యంలో అక్కడా ఓ కీలక వ్యక్తి ఉంటారని భావిస్తూ ఆ వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు తాము భారీ స్థాయిలో బంగారం ఖరీదు చేస్తామని, ఈ నేపథ్యంలోనే మార్కెట్ ధరకు గరిష్టంగా 20 శాతం తక్కువకు పసిడి వస్తుందని చెప్పుకొచ్చారు. విపణిలో బంగారు ధరలు పెరిగిన వెంటనే ఆ మొత్తం అమ్మేసి భారీ లాభాలు పొందుతామంటూ పేర్కొన్నారు.
ఈ పసిడి క్రయవిక్రయాల రికార్డులు సమర్పించనందున ఈ విషయాన్నీ పూర్తిగా నమ్మలేమని అధికారులు పేర్కొన్నారు. నౌహీరా కొన్నేళ్ల క్రితం కేరళలో ఓ ఈవెంట్ నిర్వహణకు వెళ్లినప్పుడు మోలీ థామస్‌తో పరిచయమైంది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చిన నౌహీరా తన కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈమె ద్వారానే బిజూ సైతం నౌహీరాకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచీ ఈ ముగ్గురూ కలిసి పని చేయడంతో పాటు తమ వ్యాపార కార్యకలాపాలు బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయా కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల్లో 95 శాతం మందిని మోలీ కేరళ నుంచే తీసుకువచ్చారు. వీరికైతే ఇక్కడి వారితో సంబంధాలు ఉండవని, తమ గుట్టు బయటపడదనే ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకున్నారు. మరోపక్క కేరళలో నౌహీరా షేక్ కార్యాలయం బిజూ థామస్‌కు చెందిన భవనంలోనే ఉంది. ఈ కేసులో తెరవెనుక ఉన్న కీలక నిందితులు, వారితో నిందితులకు ఉన్న సంబంధాలు నిర్థారించేందుకు వారి కాల్ డేటా సేకరించి విశ్లేషించాలని భావించారు. హీరా గ్రూప్ సీఈఓగా, వేల కోట్ల టర్నోవర్ కలిగిన నౌహీరా షేక్‌కు సొంతంగా సెల్‌ఫోన్ కూడా లేదని తేలింది.
అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న వారి ఫోన్లతో మాట్లాడుతుందే తప్ప ఆమెకు సొంతంగా సెల్‌ఫోన్, సిమ్‌కార్డులు లేవని వెల్లడైంది. మరోపక్క ప్రస్తుతం ముంబైలో ఉన్న నౌహీరాను సిటీకి తీసుకువచ్చేందుకు అధికారులు పీటీ వారెంట్ పొందారు. త్వరలో ఓ బృందం ముంబై వెళ్లి ఈమెను తీసుకురానుంది. బిజూ థామస్‌ను పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్న కూకట్‌పల్లి పోలీసులు విచారణ పూర్తి కావడంతో జైలుకు పంపారు. న్యాయస్థానం అనుమతితో మోలీ థామస్‌ను విచారించిన సీసీఎస్ పోలీసులు ఆమె కస్టడీ గడువు సోమవారంతో ముగియడంతో మళ్లీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment