
వాళ్లు పరువు కోసం పాకులాడారు. కులాంతర వివాహం చేసుకున్న కన్న కూతురిపైనే కక్ష పెంచుకున్నారు. మూడేళ్లయినా పగ తీరలేదు. ఎలాగైనా చంపేయాలని నిశ్చయించుకున్నారు. ఆస్పత్రి నుంచి వెళ్తున్న కూతురిని ఇంటికి తీసుకెళ్తున్నట్లు నమ్మించారు. పథకం ప్రకారం కొట్టుకుంటూ పొలాల వద్దకు లాక్కెళ్లారు. బాలింత అని కూడా చూడలేదు. బావి గట్టున వారం రోజుల పసి గుడ్డును వదిలి కూతురు మెడకు ఉరివేశారు. ప్రాణం పోయాక బావిలో పడేసి పరారయ్యారు. ఈ ఘటన పలమనేరు మండలం ఊసరపెంటలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుల ఆగ్రహంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సాక్షి, చిత్తూరు : మిర్యాలగూడలో ప్రణయ్ హత్యను ప్రజలు మరువకముందే చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలో మరో పరువు హత్య జరిగింది. ఓ బాలింతను తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉరివేసి చంపేశారు. బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. ఈ ఘటన ఊసరపెంట గ్రామంలో శుక్రవారం విషాదాన్ని నింపింది. పలమనేరు అర్బన్ సీఐ ఈద్రుబాషా, గ్రామస్తుల కథనం మేరకు.. ఊసరపెంట గ్రామంలో 40 కుటుంబాలుండగా అందులో 10 కుటుంబాలు అగ్రవర్ణాలకు చెందినవి. 30 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీలవి. గ్రామానికి చెందిన భాస్కర్‌నాయుడు, గోవిందయ్య పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. భాస్కర్‌నాయుడు కుమార్తె హేమావతి (23), గోవిందయ్య కుమారుడు కేశవ(25) మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో హేమావతి కుటుంబీకులు పెళ్లికి అడ్డు తగిలారు. గొడవలు జరిగాయి. వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. హేమావతి అప్పటికే మేజర్ కావడంతో ఎవరూ అడ్డుచెప్పలేకపోయారు.
ఆపై ప్రేమికులు కుప్పంలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. స్వ గ్రామానికి రాకుండా తిరుపతిలో కొంతకాలం తలదాచుకున్నారు. కేశవ కూలిపనులు చేస్తూ తన భార్యను బీటెక్ చదివించాడు. గర్భం దాల్చిన భార్యను ప్రసవం కోసం అతను పలమనేరు ఏరియా ఆస్పత్రిలో ఇటీవలే చేర్పించాడు. వారం క్రితం హేమావతి మగ శిశువుకు జన్మనిచ్చింది. రెండ్రోజుల క్రితం తల్లి, బిడ్డను స్వగ్రామానికి తీసుకొచ్చారు. విషయం హేమవతి కుటుంబీకులకు తెలిసింది. శుక్రవారం ఆరోగ్య పరీక్షల కోసం భార్యాబిడ్డను కేశవ పలమనేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యం చేయించి ఇంటికి వెళుతుండగా హేమవతి కుటుంబీకులు గ్రామ సరిహద్దులో అడ్డుపడ్డారు. కత్తులు చూపించి దౌర్జన్యంగా బిడ్డతో సహా హేమావతిని ఇంటికి తీసుకెళ్లారు. భార్య, బిడ్డకు ప్రమాదం ఉందని భావించిన కేశవ తన సెల్‌ఫోన్‌లో దీన్నంతా చిత్రీకరించి పలమనేరు పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు పయణి, రామక్రిష్ణ, రవి, ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు అక్కడికి బయలుదేరారు.
ఆలోపే జరిగిపోయింది
పథకం ప్రకారం హేమావతి కుటుంబీకులు కన్నబిడ్డ అనే మమకారం లేకుండా దాడిచేస్తూ ఇంటికి సమీపంలోని పొలం వద్దకు లాక్కెళ్లారు. తండ్రి భాస్కర్‌నాయుడు, తల్లి వరలక్ష్మి, సోదరులు భానుప్రకాష్, చరణ్, నిఖిల తదితరులు కలసి కుమార్తె మెడకు తాడు బిగించి ఉరివేసి ప్రాణం తీశారు. ఆపై అక్కడే ఉన్న బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈలోపే మృతురాలి భర్త, అతని బంధువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. బావిలో హేమావతి శవమై కనిపించింది. ఇందుకు కారణమైన ప్రధాన నిందితులు అక్కడి నుంచి అడవిలోకి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలుకాలేదు. ఇలా ఉండగా కడుపుమండిన కేశవ కుటుంబీకులు మృతురాలి తల్లి, సోదరి బంధువులపై దాడులకు దిగారు. వారి ఇంటిని ధ్వంసం చేశారు. గడ్డి వామిని కాల్చివేశారు. ఓ బైక్‌ను ధ్వంసం చేశారు. గొడవలు పెద్దవి కాకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. మృతిరాలి తల్లి, సోదరిపై దాడి జరగకుండా అదుపులోకి తీసుకున్నారు.
ఆ పసిగుడ్డుకు ఇక దిక్కెవరు
తల్లి బావిలో శవమైపోగా గట్టు మీద ఉన్న వారం రోజుల పసిగుడ్డను చూసి బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఆబిడ్డకు తల్లిని లేకుండా చేశారే అంటూ విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం, ఉద్రిక్తత కొనసాగుతోంది. పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, సీఐ ఊద్రుబాషా సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ సంఘనటలు జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. సీఐ ఈద్రుబాషా కేసును నమోదు చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment