కారేపల్లి: అతడికి పెద్ద మనుషులు జరిమానా విధించారు. అది చెల్లించలేదన్న ఆగ్రహంతో అతడి ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. కారేపల్లి అంబేద్కర్ నగర్ కాలనీలో బుధవారం సాయంత్రం ఇది జరిగింది.
ఈ కాలనీకి చెందిన కేసగాని బాలకృష్ణ, 20 ఏళ్ల క్రితం తన బంధువైన కొత్తగూడెం రామవరంలోని సింగరేణి ఉద్యోగి నుంచి రూ.30వేలకు కొంత భూమిని కొన్నాడు. రూ.20వేలు చెల్లించాడు. ఇంకా రూ.10వేలు బాకీ ఉన్నాడు. ఆ భూమిలో సిమెంట్ రేకుల ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాడు. బాలకృష్ణకు భూమిని అమ్మిన వ్యక్తి 20 ఏళ్ల తర్వాత వచ్చాడు. అంబేద్కర్ నగర్ కాలనీలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. బాలకృష్ణది తప్పుగా పెద్ద మనుషులు తేల్చారు.
అప్పుటి బాకీ రూ.10వేలకుగాను మొత్తం లక్ష రూపాయలు జరిమానాగా చెల్లించాలని పెద్ద మనుషులు తీర్పునిచ్చారు. ఇది అన్యాయమని, తాను ఉంటున్నది వాస్తవానికి ప్రభుత్వ భూమి అని బాలకృష్ణ వాదించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టును ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. ‘‘జరిమానా చెల్లించకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తావా..?’’, తీవ్ర ఆగ్రహంతో గడ్డ పలుగులతో బాలకృష్ణ ఇంటిపై కొందరు దౌర్జన్యం చేశారు. ఇంటిని.. సామాన్లను ధ్వంసం చేశారు. బాలకృష్ణ, అతడి కుటుంబీకులు భయంతో కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తారు. ధ్వంసమైన ఇంటిని పోలీసులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment