సాక్షి, సిటీబ్యూరో : నగరంలో రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు పోలీసులు ఆశ్రయిస్తున్నారు. సోమవారం ఐదుగురు బాధితులు వేర్వేరుగా ఆశ్రయించారు. వీరిలో నలుగురు వ్యక్తులు, ఓ సంస్థ ఉంది. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
►ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము రాజ్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నామంటూ అవతలి వ్యక్తులు చెప్పారు. తాము నిర్వహించిన లక్కీ డ్రాలో రూ.7 లక్షలు మీకు వచ్చాయని ఎర వేశారు. దీనికి నగర యువకుడు ఆసక్తి చూపడంతో ఆ డబ్బు పొందడానికి ముందుగా తమ ఫౌండేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆపై ఇన్‌కమ్‌ట్యాక్స్, జీఎస్టీ, ఇతర పన్నుల పేరుతో రూ.7 లక్షలు కాజేశారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
►ఓఎల్‌ఎక్స్‌లో ఉద్యోగ ప్రకటన చూసిన మోహన్ అనే యువకుడు అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదించాడు. కోరిన ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎర వేసిన అవతలి వ్యక్తులు ముందుగా తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దీనికి మోహన్ అంగీకరించడంతో సెక్యూరిటీ డిపాజిట్ సహా వివిధ పేర్లతో రూ.1.04 లక్షలు కాజేశారు.
►నగరంలోని ఓ ప్రాంతంలో రాఘవేంద్ర టిఫిన్స్ నిర్వహించే కృష్ణమూర్తికి ఇటీవల ఫోన్ వచ్చింది. శంషాబాద్‌లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో (ఐఓసీ) పని చేసే వారికి అల్పాహారం సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తామంటూ చెప్పారు. దీనికి సంబంధించిన టెండర్‌కు ఈఎండీ చెల్లించాలంటూ రూ.78 వేలు స్వాహా చేశారు. ఆ తర్వాత నేరగాళ్ళు తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
►ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనం విక్రయ ప్రకటన చూసిన లంగర్‌హౌస్‌కు చెందిన వ్యక్తి స్పందించాడు. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. వారి మాటల వల్లో పడి ఆన్‌లైన్‌లో రూ.58 వేలు చెల్లించి మోసపోయి సైబర్ కాప్స్‌కు ఫిర్యాదు చేశాడు.
►కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–కామర్స్ సైట్ ట్రేడ్ ఇండియా.కామ్‌లో నాట్కో ఫార్మసీ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు ప్రకటన పొందుపరిచారు. అందులో ఈ సంస్థ ఉప్పత్తి చేయని అబెమాక్‌సిల్బీ మందునూ జోడించారు. అయితే వాస్తవానికి ఈ ఔషధాన్ని ఎలీలిల్లీ కంపెనీ తయారు చేస్తుంది. దీనిపై అన్ని హక్కులు కేవలం ఈ సంస్థకు మాత్రమే ఉన్నాయి. ట్రేడ్ ఇండియా.కామ్‌లో ఈ ప్రకటన చూసిన అమెరికన్ సంస్థ నాట్కోపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ న్యాయస్థానం నుంచి నాట్కో సంస్థకు నోటీసులు రావడంతో కంగుతిని వివరాలు ఆరా తీసింది. దీంతో విషయం తెలిసి ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటనకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ ప్రకటనను ఎవరు పోస్ట్ చేశారో గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment