నెల్లూరు, కలిగిరి: మండలంలోని తూర్పుదూబగుంట ఎస్సీకాలనీలో ఒక కుటుంబం అర్ధరాత్రి పూజలు, నరబలికి పాల్పడినట్లు కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన చదలవాడ మాల్యాద్రి కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఒక అర్ధరాత్రి పూజలు చేసే వ్యక్తిని తీసుకు వచ్చారని, అర్ధరాత్రులు పూజలు చేశారని గ్రామస్తులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో నాలుగు రోజుల పాటు తొమ్మిది అడుగుల లోతు గుంత తీసి పూజలు జరిపి మళ్లీ పూడ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాల్యాద్రి కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబ పెద్ద మాల్యాద్రికి అనారోగ్యంగా ఉండటంతో గ్రామానికి వచ్చిన కాటికాపరి సూచనల మేరకు ఇంట్లో తొమ్మిది అడుగుల గుంత తవ్వి నాలుగు రోజులు పూజలు చేసి గుమ్మడికాయను పూడ్చి పెట్టామంటున్నారు. అయితే కాలనీవాసుల ఫిర్యాదుతో ఏఎస్సై అజ్మతుల్లా సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మాల్యాద్రి ఇంట్లో పూడ్చిన తొమ్మిది అడుగుల గుంతను తవ్విస్తున్నారు. తవ్వకాల్లో బయట పడే వస్తువులను బట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment