రోదిస్తున్న రామకృష్ణ భార్య, (ఇన్‌సెట్‌లో) రామకృష్ణ
జగిత్యాల టౌన్: ‘మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు.. మానవత్వం ఉన్నవాడు’ అని సమాజ తీరును ముందే చెప్పిన కవి మాటలు నిజమవుతున్నా యి. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనకు అచ్చం సరిపోతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మ వాడలో ఓ ఇంట్లో పోల్కారి రామకృష్ణ– కృష్ణవేణి దంపతులు కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. వీరికి కూతురు లక్కీ (3) ఉంది. కృష్ణవేణి నవంబర్ 5న మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గత నెల 30న రామకృష్ణ బాత్‌రూంలో కాలు జారి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. పరిస్థితి విషమించిందని వైద్యులు తెలపడంతో.. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకురావద్దని ఆ ఇంటి యాజమాని ఆంక్షలు విధించాడు. భర్త మరణం ఓవైపు.. కనీసం శవాన్ని ఇంటిముందు వేసుకునే అవకాశం లేకపోవడంతో కృష్ణవేణి రోదనలు మిన్నంటాయి. 28 రోజుల పసి గుడ్డును పట్టుకుని రోదించడంతో స్థానికులు కంట తడిపెట్టారు. రామకృష్ణ తల్లి ఉంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది. చివరకు సమీపంలోని డ్రైనేజీ పక్కన టెంట్లు వేసి దహన సంస్కారాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జగిత్యాల శివారులో గల శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment