
మునగాల (కోదాడ) : తమ సమీప బంధువు మృతి చెందడంతో చూసేందుకు వెళ్తున్న దంపతులను మార్గమధ్యంలోనే మృత్యువు వెంటాది. రోడ్డు దాటుతున్న వారిని కారు రూపంలో మృత్యువు కభళించింది. గుర్తు తెలియన కారు ఢీకొని భార్య, భర్త దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మునగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన సూరేపల్లి చిన ముత్తయ్య(55), సూరేపల్లి కమలమ్మ(50) దంపతులు. వీరు వ్యవసాయ కూలీలు. ఇరువురు శుక్రవారం రాత్రి ముకుందాపురంలో సమీప బంధువు ఆత్మహత్యకు పాల్పడడంతో చూసేందుకు స్వగ్రామం నుంచి బయలుదేరారు.
ముకుందాపురం వద్ద బస్సు దిగి ముకుందాపురం పాత ఊరు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ముత్తయ్యను స్థానికులు ఓ ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం ఈ ప్రమాదంతో రోడ్డున పడినట్లయ్యింది. దంపతులు ఇరువురు ప్రమాదంలో మృతిచెందడంతో వీరి స్వగ్రామమైన గణపవరంలో విషాధం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ దాసరి మహిపాల్‌రెడ్డి తెలిపారు. మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment