వీరకుమార్ (ఫైల్)
కోరుట్ల/కోరుట్ల టౌన్: చెరువులో మునిగిపోతున్న పిల్లలను కాపాడేందుకు భార్యాభర్తలు చేసిన ప్రయత్నంలో.. భార్య ఆస్పత్రి పాలుకాగా.. భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం జరిగింది. కోరుట్లలోని బీమునిదుబ్బకు గుంటుక వీరకుమార్(45) భార్య జ్యోతితో కలసి శనివారం సాయంత్రం అయిలాపూర్‌లోని అత్తగారింటికి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోరుట్ల రైల్వే స్టేషన్ సమీపంలోని కుంటలో ఇద్దరు బాలురు మునిగిపోతుండగా, గమనించాడు. వీరకుమార్ తనకు ఈతరాకున్నా.. పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో కుంటలోకి దిగి.. మునిగిపోయాడు.
ఆందోళన చెందిన జ్యోతి భర్తను కాపాడేందుకు చీర వేసి.. ఆమెకూడా కుంటలోకి జారిపోయింది. అటుగా వెళ్తున్న యువకులు సుదవేని మహేశ్, బోరే శ్యాం మరికొందరి వెంటనే చెరువులో దిగి మునిగిపోతున్న పిల్లలను బయటకి తీశారు. జ్యోతిని సైతం కాపాడారు. అంతలోపే వీరకుమార్ నీళ్లలో మునిగి మృతి చెందాడు. పదేళ్లుగా సౌదీ వెళ్లి వస్తున్న వీరకుమార్ ఈ నెల 10న తిరిగివెళ్లాల్సి ఉంది. ఆయనకు కూతురు ధరణి(17), కుమారుడు వినయ్(14) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment