చైతన్యదీప్‌ను అరెస్ట్ చూపుతున్న ఏసీపీ
కోల్‌సిటీ(రామగుండం): ఈ నెల 24న గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన వివాహిత హత్యకేసులో నిందితుడిని ఏసీపీ అపూర్వరావు సోమవారం అరెస్టు చూపారు. బిడ్డ తనకు పుట్టలేదనే అనుమానంతోనే గౌతమి(29)ని భర్త చైతన్యదీప్ గొడ్డలితో నరికి హతమార్చాడని వివరించారు.
పెళ్లయినప్పటి నుంచి వేధింపులే..
గోదావరిఖని జవహార్‌నగర్‌కు చెందిన అటికేటి రాజేశ్వరి చిన్న కూతురు గౌతమి(29)కి జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన టుంగుటూరి చైతన్యదీప్‌తో 2015 మే 10న వివాహం జరిపించారు. రూ.6 లక్షల నగదు, తులం బంగారం కట్నంగాఇచ్చారు. చైతన్యదీప్ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. కొంత కాలంగా గౌతమిని మరో రూ. 10 లక్షలు తీసుకురావాలని చైతన్యదీప్, అత్తమామ రాజకుమారి, రాయమల్లు, మరిది హర్షదీప్ వేధించేవారు. గర్భవతి అని చూడకుండా హింసించేవారు. బాధలు భరించలేక గౌతమి పుట్టింటికొచ్చింది.
డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలని..
కొడుకు పుట్టిన ఐదు నెలలకు గౌతమిని కాపురానికి తీసుకెళ్లాడు. బాబుకు నివాస్‌దీప్ అని పేరు పెట్టారు. బాబు తనకు పుట్టలేదంటూ డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని వేధించాడు. భయంతో మళ్లీ పుట్టింటికి చేరింది.
భార్యపై గొడ్డలితో దాడి..
ఎలాగైనా గౌతమిని చంపాలని చైతన్యదీప్ గోదావరిఖని వచ్చాడు. శనివారం రాత్రి ఇంట్లో తన కొడుకుకు పాలిస్తున్న తరుణంలో ఇంట్లోకి గొడ్డలి తో చొరబడ్డాడు. పడుకున్న గౌతమి తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది.
గొడ్డలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
మృతురాలి తల్లి ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం చైతన్యదీప్‌ను స్థానిక బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గొడ్డలిని, రక్తం అంటిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యదీప్ తల్లి రాజకుమారి, తండ్రి రాయమల్లు, సోదరుడు హర్షదీప్ పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో సీఐ మహేందర్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment