సాక్షి, దొడ్డబళ్లాపురం: కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు...భర్తే దైవమని సర్వం అర్పించిన భార్యను దారుణంగా చంపి శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి తల కాల్చి వేసి, శరీర భాగాలను పూడ్చివేశాడు.తర్వాత భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యా దు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. తాలూకా పరిధిలోని తపసీహళ్లికి చెందిన మునిరాజు కుమార్తె లక్ష్మి (28)కి 2011లో ఇదే తాలూకాలోని బొమ్మనహళ్లికి చెందిన రాజేశ్(35)తో వివాహమైంది.
రెండు సంవత్సరాలపాటు వారి కాపురం సాఫీగా జరిగింది. తరువాత కలహాల కాపురంగా మారింది. దీంతో కుమార్తెతో లక్ష్మి పుట్టింటికి వచ్చింది. రాజేశ్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. కేసు విచారణ జరిపిన కోర్టు లక్ష్మికి ప్రతి నెలా రూ.1500 చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసు ఇంకా నడుస్తోంది. కొన్ని నెలలు డబ్బు ఇచ్చిన రాజేశ్ అనంతరం ఇవ్వలేదు. అయితే రాజేశ్‌కు లక్ష్మి దూరమైన కొన్నాళ్లకే పెద్దల సహకారంతో మరో వివాహం చేసుకున్నాడు.
గత ఏడాది మనసు మార్చుకున్న రాజేశ్.. లక్ష్మిని తన ఇంటికి పంపించాలని ఆమె తల్లితండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో లక్ష్మి గతేడాది మళ్లీ బొమ్మనహళ్లికి వచ్చింది. ఇదే నెల 9న లక్ష్మిని రాజేష్ అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి సమీపంలోని గుండసంద్ర గ్రామం చెరువుకి తీసికెళ్లాడు. అక్కడ తలను కాల్చివేసి, శరీర భాగాలను చెరువులో పూడ్చివేసాడు. అదే రోజు రాత్రి తన భార్య కనిపించడం లేదని దొడ్డబెళవంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల విచారణలో రాజేశ్ పొంతనలేని సమాధానాలిస్తుండడంతో తమదైన శైలిలో విచారించగా ఈ ఉదంతం వెలుగు చూసింది.
భార్యపై అనుమానం
రాజేశ్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మికి అక్రమ సంబంధం ఉందని, గతేడాది మళ్లీ సంసారానికి వచ్చాక పరాయి పురుషులతో మాట్లాడుతుండేదని, తాను ప్రశ్నించగా కోర్టు ఆదేశం ప్రకారం ఇవ్వాల్సిన బాకీ రూ.1.75లక్షలు ఇస్తే వెళ్లిపోతానని గొడవ చేసిందని వివరించాడు. డబ్బులు ఇవ్వలేక, కేసు నుంచి విముక్తి కావాలనే ఉద్దేశంతో లక్ష్మిని అంతం చేసినట్లు నిందితుడు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. అయితే డబ్బు ఇవ్వకుండా, కోర్టు కేసునుంచి తప్పించుకునేందుకు తమ కుమార్తెను రాజేష్ హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
శరీర భాగాల వెలికితీత
బుధవారం సాయంత్రం అసిస్టెంట్ కలెక్టర్ మహేశ్‌బాబు సమక్షంలో ఎస్పీ అమిత్‌సింగ్ ఆధ్వర్యంలో గుండసంద్ర గ్రామం చెరువులో రాజేశ్ పూడ్చిన లక్ష్మి శరీర భాగాలను పోలీసులు వెలికితీయించిపోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. నిందితుడిని కూడా తీసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిందితుడిని అప్పగిస్తే తామే చంపేస్తామని మృతురాలి బంధువులు గొడవ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment