
మదనపల్లె క్రైం : భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు గురువారం రాత్రి జనం చూస్తుండగానే మదనపల్లె బస్టాండులో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రం గా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న అతన్ని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకటో పట్టణ పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం పోతులప్ప వీధిలో కాపురం ఉంటున్న కె.వెంకటరమణ కుమారుడు విజయ్‌కుమార్(35) కూరగాయల వ్యాపారంతో భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఐదు నెలల క్రితం విజయ్‌కుమార్ భార్య అలిగి తన బిడ్డను తీసుకుని పుట్టినిల్లు వైఎస్సార్ జిల్లాకు వెళ్లిపోయింది. కాపురానికి రావాలని పలుమార్లు కోరినా ఆమె వినలేదు. భార్య, బిడ్డ లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి స్థానిక బెంగళూరు బస్టాండులో జనం చూస్తుండగానే శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆటో డ్రైవర్లు, స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఒకటో పట్టణ ఎస్‌ఐ సుమన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment