ప్రవీణ వివాహం నాటి ఫోటో
విశాఖపట్నం: అదనపు కట్నంగా రూ.5 లక్షలు తీసుకురా.. లేదా రెండో పెళ్లి చేసుకుంటా.. విడాకులు ఇచ్చేయ్.. అంటూ భర్తతో పాటు అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి ఆదివారం మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ద్వారా మనసు మార్చుకున్నట్టు నటించిన భర్త మళ్లీ తన వక్రబుద్ధి చూపడంతో బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని చినవాల్తేరు సమీప విద్యానగర్‌కు చెందిన రీసు నాగేశ్వరరావు, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ప్రవీణను రాజమండ్రి సమీప కడియం ప్రాంతానికి చెందిన ఓదూరి సుమన్ కల్యాణ్‌తో 2014 ఆగస్టు 15న వివాహం చేశారు. కట్నం, సారె, ఆడపడుచు లాంఛనాలు, వరుడికి బంగారంతో కలిపి సుమారు రూ.11 లక్షల వరకు చెల్లించారు. సుమన్ సౌత్‌సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల పాటు కడియంలో వీరి కాపురం సజావుగానే సాగింది.
సుమన్ సోదరుడు దినేష్, సోదరి అలేఖ్యలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ప్రవీణ గర్భిణిగా ఉన్న సమయంలో ఆడపడుచు అలేఖ్య, ఆమె భర్త పార్థసారథి కలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి రూ.10 లక్షల కట్నం చాలా తక్కువ అని కట్టుకథలు అల్లడంతో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమెను రూ.5లక్షల అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించడం ప్రారంభించారు. లేని పక్షంలో విడాకులు ఇచ్చేస్తే మేనత్త కుమార్తెతో వివాహం చేస్తామని బెదిరించేవారు. విషయాన్ని ప్రవీణ తమ తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పగా వారు నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రవీణను భర్త, ఆడపడుచు శారీరకంగా హింసించడంతో గర్భం పోయింది. అప్పట్లో ప్రవీణ తల్లిదండ్రులు ఈ విషయంపై అత్తింటి వారిని ప్రశ్నించగా.. సర్దిచెప్పి పంపించేశారు. సుమన్ విధుల పేరుతో పదిరోజుల పాటు ఇంటికి దూరంగా ఉండేవారు.
ఈ క్రమంలో సుమన్ తనకు విశాఖకు బదిలీ అయిపోతుందని మాయమాటలు చెప్పి ప్రవీణను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించేశాడు. అప్పటి నుంచి సుమన్ వారం, పది రోజులకోసారి విశాఖలోని అత్త వారింటికి వచ్చి వెళుతుండేవాడు. మూడు నెలలుగా ఆయన రావడం లేదు. దీనిపై తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ కడియంలోని అత్తింటికి వెళ్లి ప్రశ్నించగా.. వారు దౌర్జన్యం చేశారు. వివాహం సమయంలో గౌడ సామాజిక వర్గం అన్ని చెప్పిన సుమన్‌కల్యాణ్ వాస్తవానికి ఎస్సీ(మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వారని వివాహం తరువాత తెలిసిందని, కాని, తనకు కులాల పట్టింపు లేదని ప్రవీణ పోలీసులకు వివరించింది. అయితే కులం పేరుతో దూషించారంటూ తనపై తప్పుడు కేసులు పెడతామని అత్తింటి వారు బెదిరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేసును మూడో పట్టణ సీఐ బి.వెంకటరావు దర్యాప్తు చేస్తున్నారు.
సీఐ వెంకటరావుకి ఫిర్యాదు చేస్తున్న ప్రవీణ, తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment