బిడ్డలతో మృతురాలు రుక్మిణి (ఫైల్)
మదనపల్లె క్రైం: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను.. ఓ భర్త అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పై పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని అనపగుట్టకు చెందిన సురేంద్ర అలియాస్ సూరి(40) పదిహేనేళ్ల క్రితం క్రితం స్వగ్రామం కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ గొడ్డిండ్లపల్లె నుంచి వచ్చి అనపగుట్టలో స్థిరపడ్డాడు. స్థానికంగా ఉంటూ చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం వెళ్లిన సూరికి ముళబాగళ్ సమీపంలోని హెచ్.గొల్లపల్లెకు చెందిన రత్నమ్మ, శీనప్ప దంపతుల కుమార్తె రుక్మిణి(38)ని పెళ్లి చేసుకున్నాడు.
ఇది వరకే 20 ఏళ్ల క్రితం రుక్మిణికి లక్ష్మణప్పతో మొదటి సారి వివాహం అయింది. వీరికి రెడ్డి కిషోర్ కుమారుడు ఉన్నాడు. సూరికి కూడా ఇది వరకే పెళ్లి అయి భార్య వదిలేసింది. కాగా రుక్మిణి రెండో భార్య. ఈమె ఎస్టేట్‌లోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనికి వెళ్తుండేది. వీరికి నేత్రా(7) కుమార్తె ఉంది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ గొడవలు పడేవారు. రోజూ మాదిరిగానే సోమవారం పనికి వెళ్లి ఇంటికి వచ్చిన రుక్మిణితో సూరిగొడవపడ్డాడు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా ఇంటిలోని రోకలి బండతో భార్య తలపై మోదాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు గుర్తించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సూరిపై 2009లో హత్యకేసు, 2012 దారి దోపిడీ, హత్య కేసులు ఉన్నాయి. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ కృష్ణయ్య, సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment