కాశింబీ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సైలు
జలదంకి: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతికిరాతకంగా మొద్దు కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన మండలంలోని బీకే అగ్రహారంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బీకే అగ్రహారం గ్రామానికి చెందిన షేక్ మీరాసాహెబ్, సుల్తాన్‌బీ కుమారుడు నిషార్‌కు దుత్తలూరు మండలం కమ్మవారిపాళెంకు చెందిన మీరాబీ పెద్ద కుమార్తె కాశింబీ ఉరఫ్ ఆషా (28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమార్తె అష్మా, 7 ఏళ్ల కుమారుడు షఫీ ఉన్నారు. ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య కలతలు చోటు చేసుకున్నాయి. అయితే కాశింబీకి అదే గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం అనుమానంతో నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ వేధింపులు తాళలేక కాశింబీ రెండు.. మూడు సార్లు పుట్టింటికి వెళ్లింది. తిరిగి వారి మధ్య గొడవలను పెద్ద మనుషులు పరిష్కరించడంతో గ్రామానికి వచ్చేది. ఆదివారం రాత్రి వీరి ఇంటి సమీపంలోని ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. నిషార్ అక్కడికి వెళ్లి వచ్చి వరండాలో నిద్రిస్తున్న భార్యను ప్లాన్ ప్రకారం మొద్దుకత్తితో అతి కిరాతకంగా తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిషార్ కత్తిని ధాన్యం బస్తాల చాటున దాచి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న కావలిరూరల్ సీఐ అశోక్‌వర్ధన్, జలదంకి ఎస్సై ఆంజనేయులులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment