పిల్లలు నిఖిల్, లేహ్యాతో బాధితురాలు చిన్ని
గాజువాక: కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను కడతేర్చడానికి ప్రయత్నించాడొక శాడిస్టు. అర్ధ రాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి హత్య చేయడానికి ప్రయ త్నించిన ఘటన గాజువాకలో కలకలం రేపింది. స్థానిక నేతాజీ కాలనీలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై బాధితురాలు, గాజువాక పోలీసు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కార్పెంటర్‌గా పని చేస్తు న్న గంగవరం గ్రామ నివాసి కొప్పనాతి దుర్గా రావుతో తుంగ్లాం గ్రామానికి చెందిన చిన్నికి పద్నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి కుమారుడు నిఖిల్, కుమార్తె లేహ్యా ఉన్నారు. వివాహమైనప్పట్నుంచీ చిన్నిని వేధిస్తున్నాడు. దీంతో ఆమె కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. నేతాజీ కాలనీలోని తన సోదరి పల్లవి ఇంట్లో తలదాచుకుంటోంది. దుర్గారావు అక్కడి కి కూడా వెళ్లి వేధిస్తుండడంతో పలుమార్లు పోలీసులను ఆశ్రయించింది.
వారు స్టేషన్‌కు పిలిపించి సర్దిచెప్పి పంపించేవారు. అయినప్పటికీ అతడిలో మార్పు లేకపోవడంతో వారి మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కూడా నేతాజీ కాలనీలోని ఆమె నివసిస్తున్న ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటి బయట గడియను పెట్టేశాడు. చిన్ని, ఆమె పిల్లలు నిద్రిస్తున్న గదికి నిప్పంటించడం కోసం కిటికీలోంచి పెట్రోలు పోశాడు. తనతో కాపురానికి రాకపోతే నిప్పు పెట్టేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వారి మధ్య ఘర్షణ కారణంగా చుట్టు పక్కలవారు బయటకు రావడాన్ని గమనించిన దుర్గారావు అక్కడ్నుంచి పరారయ్యాడు. ప్రాణాలతో బయటపడ్డ చిన్ని ఆదివారం తన పిల్లలతో కలిసి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు ప్రాణరక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిన్ని ఇంటి పక్కనే ఉన్న ఓ చర్చిలో డిష్ టీవీ యాంటీనా, వాటర్ పైప్‌లైన్‌ను కూడా దుర్గారావు ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. కేసును గాజువాక ఎస్‌ఐ రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment