కూతురి ఎదుటే ప్రాణం తీసిన భర్త | Husband Murdered Wife In Nellore | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణహత్య

Published Thu, Jun 13 2019 9:29 AM | Last Updated on Thu, Jun 13 2019 9:42 AM

Women Murdered By Husband In Nellore - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ   

సాక్షి, సోమశిల (నెల్లూరు): అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో కూతురి కళ్ల ముందే గొంతు నులిమి ప్రాణం తీశాడు. పాప ఏడుస్తున్నా కనికరం చూపలేదు. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని పడమటికంభంపాడు ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఆత్మకూరు సీఐ పాపారావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఉదయగిరి పెంచల నరసయ్య, విజయమ్మకు (35)కు 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి పవిత్ర, ప్రవీణ్, సిద్ధూ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. నరసయ్య కూలి పనులు చేస్తుంటాడు. కొంతకాలం క్రితం భర్తకు భర్యపై అనుమానం కలిగింది. దీంతో ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు.

మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో నరసయ్య విజయమ్మ గొంతు నులిమి ఊపిరాడకుండా చేస్తుండగా కూతురు పవిత్ర చూసి ఏడుస్తూ వారించబోయింది. అతను వినకుండా భార్య తుదిశ్వాస విడిచే వరకూ గొంతు నులిమి పట్టాడు. దీంతో ఆమె మృత్యువాత పడింది. నరసయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. పవిత్ర ఏడుస్తూ ఉండడంతో చుట్టుపక్కల వారు విని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో హత్య జరిగిందనే విషయం తెలుసుకుని స్థానికులు ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం ఆత్మకూరు డీఎస్పీ అంజనాద్రి మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ పాపారావు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement